తెలంగాణ రాష్ట్ర నిర్మాత, ఉద్యమ సారథి, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సిట్ (SIT) నోటీసులు జారీ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ ఖతార్ ( BRS Khatar ) శాఖ అధ్యక్షులు శ్రీధర్ అబ్బగౌని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి , ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇటువంటి చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.
ప్రజాక్షేత్రంలో కేసీఆర్ చరిష్మాను ఎదుర్కోలేక, అధికార బలంతో దర్యాప్తు సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం పావుల్లా వాడుకుంటోందని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపేనని అన్నారు. పదేళ్లపాటు తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిపి, అభివృద్ధిని పరుగులు తీయించిన నాయకుడిపై బురద చల్లడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని విపక్ష నాయకులను వేధించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టని, చట్టం తన పని తాను చేయాలి కానీ, ప్రభుత్వ అడుగులకు అనుగుణంగా వ్యవహరించడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలు కేసీఆర్కు అండగా ఉంటారని వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు తమ పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజా క్షేత్రంలో తీవ్రమైన పరిణామాలు తప్పవని హెచ్చరించారు.