అమరావతి : భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు విరాళాల వెల్లువ కొనసాగుతుంది. ఇప్పటికే విరాళాల ద్వారా ఏపీకి సుమారు రూ. 350 కోట్లు వచ్చాయి. తాజాగా ఏపీకి వరద సహాయం కింద అదానీ గ్రూప్(Adani Group ) రూ. 25 కోట్లను విరాళం (Donation) గా ప్రకటించింది. ఈ మేరకు అదానీ పోర్ట్స్(Adaniports) ఎండీ కరణ్ అదానీ విరాళం చెక్కును విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి (Chandra Babu) కి అందజేసినట్టు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
సెప్టెంబర్ మొదటివారంలో భారీ వర్షాలు పడడంతో ఏపీలోని పలు జిల్లాలు వరదలతో నీట మునిగాయి. ముఖ్యంగా బుడమేరు వాగుకు పడ్డ గండ్లకారణంగా విజయవాడ నగరం నీట మునిగింది. దాదాపు వారం రోజుల పాటు బాధితులు నీళ్లల్లోనే ఉండిపోయారు. దాదాపు రెండున్నర లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. ఇంటిలోని వస్తువులన్నీ నీట మునగడంతో అవి ఎందుకు పనికిరాకుండా పోయాయి.
40 మంది ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో పశుపక్షాదులు మృత్యువాత పడ్డాయి . ఏపీలో బాధితులకు అండగా నిలిచేందుకు ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న అనేక మంది పారిశ్రామిక, సామాజక వేత్తలు విరాళాలను ప్రకటించి ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు.