RJD Leader : వక్ఫ్ బోర్డు అధికారాలను కుదించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో బిల్లు తీసుకురానుందనే వార్తలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందించారు. వక్ఫ్ బోర్డు బిల్లు, లవ్ జిహాద్‌పై కఠిన చర్యలకు యూపీ ప్రభుత్వం సంసిద్ధమవడంపై తేజస్వి యాదవ్ తనదైన శైలిలో రియాక్టయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడటం లేదని, పేదల సంక్షేమం, దేశాభివృద్ధి గురించి వారికి ఎలాంటి ఆసక్తీ లేదని ఆరోపించారు.
మండుతున్న ధరలు, నిరుద్యోగం వంటి సమస్యల పరిష్కారానికి ప్రజలకు మెరుగైన విద్య, వైద్య వసతులు కల్పించడానికి కేంద్ర పాలకులు పూనుకోవడం లేదని మండిపడ్డారు. బిహార్ వంటి పేద రాష్ట్రాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఫ్యాక్టరీలు, పరిశ్రమలు వంటివి ఏర్పాటు చేయాలనే శ్రద్ధ కేంద్ర సర్కార్‌కు లేదని ఆరోపించారు.
కేవలం హిందూ, ముస్లింల పేర్లతో విభజన రాజకీయాలు చేసి లబ్ధి పొందాలనే కాషాయ నేతలు కోరుకుంటారని చెప్పారు. కాగా, వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న వార్తలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అంతకుముందు స్పందించారు. వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తిని తొలగించి దాన్ని తమ చెప్పుచేతల్లోకి తీసుకోవాలని మోదీ సర్కార్ యోచిస్తోందని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని కేంద్రం భావిస్తున్నదని అన్నారు.
Read More :
Pakistan posters | ఓ వ్యక్తి ఇంట్లో పాకిస్థాన్ అనుకూల నినాదాలు.. ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం