Tejashwi Yadav : బిహార్‌కు చెందిన రాజకీయ పార్టీ ఆర్జేడీ (రాష్ట్రీయ జనతా దళ్) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ నియామకమయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ ఆమోదం తెలిపింది. బిహార్ రాజధాని పాట్నాలోని ఒక హోటల్లో ఆదివారం ఈ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి పార్టీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి, మాజీ సీఎం రబ్రీదేవి, తేజస్వి యాదవ్, మిసా భారతి సహా కీలక నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలోనే తేజస్విని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నట్లు కమిటీ ప్రకటించింది. పార్టీలో నాయకత్వ మార్పు అవసరమని, అలాగే యువతకు అవకాశం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు.. పార్టీ అధినేత లాలూ కొన్నేళ్లుగా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో పార్టీ నిర్వహణ కష్టమైపోతోంది. అందుకే కొత్త నాయకుడిగా తేజస్వి యాదవ్‌ను ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీకి సంబంధించి మరికొన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. పార్టీ భవిష్యత్ వ్యూహాలు, నిర్మాణాత్మక మార్పులు, నిర్వహణ లోపాలు సరిదిద్దడం, పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. వచ్చే తరాల్ని ఆకట్టుకునేలా పార్టీని సమూలంగా మార్చాలని తేజస్వి భావిస్తున్నట్లు తెలుస్తోంది.