భోపాల్, జూన్ 6: కరోనాతో తల్లిదండ్రులు మరణించారు. ఆ దుఃఖ సమయంలోనే పదో తరగతి పరీక్షలు వచ్చాయి. అయితే, తండ్రికి ఇచ్చిన మాట కోసం ఆ చిన్నారి బాధను పంటి బిగువన దాచుకున్నది. పుట్టెడు దుఃఖంతోనే పదో తరగతి పరీక్షలకు హాజరైంది. 99.8 % మార్కులతో టాపర్‌గా నిలిచింది. ‘నాన్న, నువ్వు నాకు దూరమైనా ఎప్పుడూ ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ప్రయత్నిస్తూనే ఉంటా’ అని దూరమైన తండ్రిని గుర్తుచేసుకుంటూ కవిత రాసుకొంది. మధ్యప్రదేశ్‌కు చెందిన 17 ఏండ్ల వనిశా పాఠక్ ఆత్మైస్థెర్యాన్ని చూసిన పలువురు మెచ్చుకున్నారు. అలాంటి చదువుల తల్లికి ఇప్పుడు అప్పుల బాధలు చుట్టుముట్టాయి. ఇంటి కోసం తండ్రి తీసుకున్న రూ. 29 లక్షల రుణాన్ని చెల్లించాలంటూ ఎల్ఐసీ వనిశాకు పలుసార్లు నోటీసులు ఇచ్చింది. రుణాన్ని తీర్చకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వనిశా, ఆమె తమ్ముడు (11) మైనర్లు కావడంతో ఎల్ఐసీ ఏజెంట్ అయిన బాలిక తండ్రి జితేంద్ర పేరు మీద ఉన్న కమీషన్లు, సేవింగ్స్, పాలసీలను ఎల్ఐసీ బ్లాక్ చేసింది. తాను మైనర్‌ను అని, 18 ఏండ్లు నిండే వరకు తల్లిదండ్రుల సేవింగ్స్‌ను తీసుకోలేనని వనిశా ఎల్ఐసీకి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసింది. మీడియాలో ఈ వార్త రావడంతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. బాలిక విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఎల్ఐసీకి సూచించారు. వనిశాకు 18 ఏండ్లు నిండేవరకూ వేచిచూడాలని ఎల్ఐసీ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.