పనాజీ : గోవాలోని పోరోవోరిమ్లో దారుణం జరిగింది. లైంగికదాడి బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. 16 ఏండ్ల బాలికను నవంబర్ 3వ తేదీన ఓ వ్యక్తి(31) కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే బాధితురాలికి ముందే ఆ వ్యక్తి తెలియడంతో అతను పిలిచిన వెంటనే వెళ్లింది. కారులో కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం బాధితురాలిని ఆమె ఇంటికి సమీపంలో వదిలేసి వెళ్లాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక అదే రోజు సాయంత్రం స్థానికంగా మూడంతస్తుల భవనం మీదకెళ్లి కిందకు దూకింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. బాధితురాలి కాలు విరిగిందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం రోజు నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు.