Delhi Police : ఒక పోలీసాఫీసర్ మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధిస్తున్నట్లు ఒక ఫేక్ ఏఐ వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు.. అది ఫేక్ వీడియో అని గుర్తించారు. ఈ వీడియోను మొదట షేర్ చేసిన నిందితుడు నదీమ్ అహ్మద్ (24)ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అంశానికి సంబంధించిన వివరాలివి. సర్‌కు వ్యతిరేకంగా, సీఈసీ రాజీనామా కోరుతూ సోమవారం ఢిల్లీలో ఆప్ సహా పలు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన జరిగిన సంగతి తెలిసిందే.
ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకునే క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఇదే సమయంలో అక్కడ న్యూస్ కవర్ చేస్తున్న కొందరు మహిళా జర్నలిస్టులపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, సీజేపీ అభిజీత్ దీప్కే సహా పలువురు ఈ ఘటనలను ఖండించారు. ఈ ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో వివేక భగత్ కూడా ఉన్నారు. మహిళా జర్నలిస్టులపై వేధింపులకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వీటిలో కొన్ని ఫేక్ ఏఐ వీడియోలు ఉన్నాయి. ఈ మొత్తానికి సంబంధించిన కేసును ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు. దీనిపై విచారణ జరుపుతుండగా.. ఏసీపీ వివేక్ భగత్‌కు సంబంధించిన ఫేక్ వీడియోను గుర్తించారు. ఆ వీడియోలో ఏసీపీ ఒక మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధిస్తున్నట్లు ఉంది. ఈ వీడియో హరియాణా నుంచి సర్క్యులేట్ అయినట్లు తేల్చారు. న్యూస్ అయినా అనే ఒక అకౌంట్ నుంచి నదీమ్ అహ్మద్ అనే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఈ వీడియోను షేర్ చేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
ఇటీవల సీజేపీ నిరసన జరిగిన తర్వాత నుంచి తాను ఈ సోషల్ మీడియా ఛానెల్‌ను ప్రారంభించినట్లు అతడు చెప్పాడు. కొన్ని ఏఐ టూల్స్ వాడి ఈ వీడియోలు తయారు చేస్తున్నట్లు చెప్పాడు. మరోవైపు ఈ ఆరోపణల నేపథ్యంలో ఏసీపీగా ఉన్న వివేక్ భగత్‌ను అడిషనల్ డీసీపీగా బాధ్యతలు చేపట్టకూడదని ఆదేశించింది. అతడిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు నిజమో కాదో తేలేవరకు ఈ బాధ్యతలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.