– డ్రైవర్‌కు గాయాలు
రుద్రంపూర్, అక్టోబర్ 06 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని వెంకటేష్ ఖని కోల్‌మైన్‌లో మొదటి షిఫ్ట్‌లో డంప్‌యార్డ్ ఆర్ఎల్–710 వద్ద ఓవర్ బర్డెన్ మట్టిని తరలిస్తున్న వోల్వో వాహనం మంగళవారం ప్రమాదానికి గురైంది. డంపింగ్ యార్డ్ వద్ద మూల మలుపులో అతివేగంగా వెళ్లడం వల్లనే అదుపుతప్పి బోల్తా పడ్డట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్‌ను తొలుత రుద్రంపూర్ డిస్పెన్సరీకి తరలించగా, యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేయడంతో మెరుగైన వైద్యం కోసం సింగరేణి ప్రధాన ఆస్పత్రికి తరలించారు. కాగా డ్రైవర్‌కు అవసరమైన శిక్షణ, లైసెన్స్ ఉన్నాయా? అనే అంశాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రమాదానికి గురైన ప్రదేశంలోని మూలమలుపు నిర్మాణం, వెడల్పుపైనా డ్రైవర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సింగరేణి నిర్దేశించిన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మలుపు లేదని, తగినంత వెడల్పు లేకపోవడంతో భారీ వాహనం అదుపుతప్పినట్లు డ్రైవర్ పేర్కొన్నట్లు సమాచారం. ఇదే ప్రాంతంలో గత సెప్టెంబర్ 15న కూడా ప్రమాదం జరిగినట్లు కార్మికులు గుర్తు చేస్తున్నారు. వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రమాదానికి అసలు కారణాలపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తేవాలని అలాగే వాహనాల రాకపోకలు జరిగే ప్రాంతాల్లో రహదారి వెడల్పు, మూలమలుపుల నిర్మాణం, బర్మ్ స్థితి, తదితర అంశాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని వారు కోరుతున్నారు.