బెంగళూరు: భార్య చిత్రహింసలు భరించలేక చనిపోవాలని టెక్కీ భావించాడు. గవర్నర్ నివాసం వద్దకు చేరుకున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. (Techie tries to commit suicide) అప్రమత్తమైన పోలీసులు అతడ్ని అడ్డుకుని ఆత్మహత్యాయత్నాన్ని నిలువరించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. చిక్కబళ్లాపుర జిల్లాకు చెందిన జునైద్ అహ్మద్, స్టాఫ్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం గవర్నర్ నివసించే రాజ్‌భవన్ వద్దకు చేరుకున్నాడు. వెంట తెచ్చిన పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడేందుకు నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు.
కాగా, అక్కడున్న పోలీసులు వెంటనే స్పందించారు. జునైద్ ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే తనపై తప్పుడు కేసు పెట్టి భార్య వేధిస్తున్నదని జునైద్ ఆరోపించాడు. చిక్కబళ్లాపుర పోలీస్ స్టేషన్లో భార్యపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా కేసు నమోదుకు నిరాకరించారని వాపోయాడు. ఈ నేపథ్యంలో చనిపోవాలని భావించినట్లు చెప్పాడు. అయితే పోలీసులు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టినట్లు తెలుస్తున్నది.