Techie suicide : భార్య వేధింపులు తాళలేక మరో టెకీ ఆత్మహత్య (Techie suicide) కు పాల్పడ్డాడు. బెంగళూరుకు చెందిన అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన మరవకముందే ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో టెకీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య, ఆమె కుటుంబం తనను మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తోందని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణం తర్వాత కూడా న్యాయం జరగకపోతే తన బూడిదను డ్రైనేజీలో కలుపాలని చెబుతూ ఒక సెల్ఫీ వీడియో తీసి దగ్గరి బంధువుకు షేర్ చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. మోహిత్ యాదవ్ అనే వ్యక్తి ప్రియ అనే యువతిని ఏడేళ్లుగా ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఒక సిమెంట్ కంపెనీలో ఫీల్డ్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే దంపతుల మధ్య గొడవలు తలెత్తాయి. భార్య తరఫు కుటుంబం తనను వేధింపులకు గురిచేస్తోందని, బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ మోహిత్ ఒక వీడియో రికార్డు చేశాడు. ఆ తర్వాత ఆ వీడియోను దగ్గరి బంధువుకు షేర్ చేసి ఒక హోటల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
‘రెండు నెలల క్రితం నా భార్య ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగంలో చేరింది. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న ఆమెకు మా అత్తయ్య అబార్షన్ చేయించింది. ఆమెపై ఉన్న బంగారు ఆభరణాలను బలవంతంగా దగ్గర పెట్టుకుంది. మా పెళ్లి సమయంలో వారి నుంచి నేను ఒక రూపాయి కట్నం కూడా తీసుకోలేదు. కానీ నాపై తప్పుడు కేసులు పెట్టారు. నాకు నా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులను తన పేరిట బదిలీ చేయాలని నా భార్య కూడా తరచూ గొడవలు పెట్టుకునేది. ఈ విషయంపై ఆమె, ఆమె కుటుంబసభ్యులు నన్ను మానసికంగా చిత్రహింసలకు గురిచేశారు. వారు చెప్పినట్లు చేయకపోతే నా కుటుంబసభ్యులపై కూడా కేసులు పెడతామని బెదిరించారు’ అని మోహిత్ ఆ వీడియోలో చెప్పాడు.
అంతేగాక ‘తన ఆస్తి విషయంలో మా మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. నా కుటుంబం గురించి నేను ఎంతో ఆందోళన చెందుతున్నాను. వారి వేధింపులు తట్టుకోలేక పోతున్నా. అమ్మానాన్న నన్ను క్షమించండి. నేను చనిపోయాక కూడా న్యాయం జరగకపోతే నా బుడిదను కాలువలో కలుపండి’ అని వీడియోలో ఆవేదన వ్యక్తంచేశాడు. మోహిత్ ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.