లక్నో: ఐటీ కంపెనీలో పని చేస్తున్న టెక్కీ కదులుతున్న రైలులో తన భార్యకు ట్రిపుల్ తలాక్ (Triple Talaq) చెప్పాడు. స్టేషన్లో రైలు ఆగగానే భార్యను కొట్టి పారిపోయాడు. షాకైన ఆమె భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 28 ఏళ్ల మహమ్మద్ అర్షద్, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ ప్రైవేట్ సంస్థలో కంప్యూటర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది జనవరి 12న రాజస్థాన్‌లోని కోటాకు చెందిన 26 ఏళ్ల అఫ్సానాను వివాహం చేసుకున్నాడు. మ్యాట్రిమోనియల్ ప్రకటన ద్వారా వీరిద్దరి పెళ్లి సంబంధం కుదిరింది.
కాగా, గత వారం ఉత్తరప్రదేశ్‌లోని పుఖ్రాయన్లో అర్షద్ పూర్వీకుల ఇంటికి ఈ జంట వెళ్లింది. ఈ సందర్భంగా అర్షద్‌కు అప్పటికే వివాహమైనట్లు తెలిసి అఫ్సానా షాకైంది. దీని గురించి నిలదీయగా అర్షద్, అతడి తల్లి కలిసి ఆమెను కొట్టారు. వరకట్నం కోసం అఫ్సానాను హింసించారు. ఏప్రిల్ 29న అర్షద్, అఫ్సానా కలిసి పుఖ్రాయన్ నుంచి రైలులో భోపాల్‌కు బయలుదేరారు.
మరోవైపు రైలు ప్రయాణంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఝాన్సీ స్టేషన్ సమీపంలో కదులుతున్న రైలులో భార్య అఫ్సానాకు అర్షద్ మూడు సార్లు తలాక్ చెప్పాడు. రైలు ఝాన్సీ స్టేషన్లో ఆగగానే భార్యను కొట్టిన అర్షద్ రైలు దిగి పారిపోయాడు. ఈ సంఘటనతో షాకైన అఫ్సానా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు పరారీలో ఉన్న అర్షద్ కోసం వెతుకుతున్నారు.