బెంగళూరు: అప్పటివరకు భార్య, పిల్లాడితో సంతోషంగా ఉన్న టెకీ భరత్‌ను కొద్ది క్షణాల్లోనే మృత్యువు ఉగ్రవాదుల రూపంలో కబళించింది. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారిలో కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన టెకీ భరత్ భూషణ్ (35) కూడా ఉన్నారు.
విహార యాత్రకు భార్య సుజాత, మూడేండ్ల కుమారుడితో పహల్గాంలోని బైసరన్ లోయలోకి వెళ్లిన భరత్‌ను ఉగ్రవాదులు మంగళవారం మధ్యాహ్నం అడ్డగించారు. అతని చేతిలో ఉన్న పిల్లాడిని భార్యకు అప్పగించమని చెప్పి నీ పేరు ఏంటని అడిగారు. భరత్ అని సమాధానం ఇచ్చిన అతడిని మతమేమిటని ప్రశ్నించారు. ‘నేను హిందువుని’ అని చెప్పగానే తన ఎదురుగానే తన భర్తను తలపై కాల్చి చంపారని అతని భార్య డాక్టర్ సుజాత విలపిస్తూ తెలిపింది.