సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 20, 2020 , 02:18:39

ఆవేదన.. ఆక్రోశం!

ఆవేదన.. ఆక్రోశం!
  • సుప్రీంకోర్టు కమిటీ ఎదుట షాహీన్‌బాగ్‌ నిరసనకారుల గోడు
  • సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ను రద్దు చేశాకే ఆందోళన విరమిస్తామని స్పష్టీకరణ

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా గత రెండు నెలలుగా నిరవధికంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌ నిరసనకారులు బుధవారం సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కమిటీ ముందు తమ ఆక్రోశాన్ని, ఆవేదనను తెలియజేశారు. నిరసనకారులతో చర్చించి ప్రతిష్ఠంభనను తొలిగించేందుకు సుప్రీంకోర్టు నియమించిన ద్విసభ్య కమిటీలో సభ్యులైన న్యాయవాదులు సంజయ్‌ హెగ్డే, సాధనా రామచంద్రన్‌తోపాటు మాజీ ఉన్నతాధికారి వజాహత్‌ హబీబుల్లా బుధవారం షాహీన్‌బాగ్‌కు వెళ్లారు. నిరసనకారులతో దాదాపు మూడు గంటలపాటు చర్చలు జరిపారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ను రద్దు చేశాకే తాము ఆందోళన విరమిస్తామని నిరసనకారులు కమిటీకి స్పష్టంచేశారు. దీనిపై రామచంద్రన్‌ స్పందిస్తూ.. ‘నిరసన తెలియజేసేందుకు మీకు హక్కు ఉన్నదని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అయితే ఇతర పౌరులకు కూడా హక్కులున్నాయి. వారి హక్కులనూ కాపాడాలి. అందరం కలిసి సమస్యకు పరిష్కారం కనుగొనాలని మేం భావిస్తున్నాం. మీరు చెప్పిన అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తాం’ అని చెప్పారు. 


అంగుళం కూడా కదలం..

నిరసనకారులు మధ్యవర్తులకు తమ వాదనను వినిపించారు. మొదటి నుంచీ దీక్షలో పాల్గొన్న ‘దాదీ’లలో (వృద్ధ మహిళల్లో) ఒకరైన బిల్కిస్‌ అనే మహిళ మాట్లాడుతూ.. తమపై తుపాకీ ఎక్కుపెట్టినా ఒక్క అంగుళం కూడా కదలబోమని స్పష్టంచేశారు. ‘మేమేమీ రహదారిని దిగ్బంధించలేదు. రోడ్డులో దీక్షా శిబిరం ఉన్నది 100-150 మీటర్లు మాత్రమే. భద్రత పేరిట పోలీసులే బారికేడ్లు ఏర్పాటుచేసి రహదారిని మూసివేశారు. ఇందుకు మమ్మల్ని ఎందుకు నిందిస్తున్నారు’ అని పేర్కొన్నారు. సీఏఏను రద్దు చేసే వరకు తాము ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. మరో మహిళ మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణ కోసం తాము నిరసన చేపడుతున్నామని, కానీ కొందరు ప్రజలు కేవలం అసౌకర్యాన్నే చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘రాత్రిల్లు చలిలో, ఆహారం లేకుండా, పిల్లలను కూర్చొబెట్టుకుని మేం కూడా అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నాం’ అని పేర్కొన్నారు. ఇంకో మహిళ మాట్లాడుతూ.. ఈ ఆందోళన తమకు తీవ్ర మానసిక వేదనను కలిగిస్తున్నదని చెప్పారు. 


logo