రాంచీ: మాక్ డ్రిల్‌లో పోలీసుల నిర్లక్ష్యం వల్ల స్కూల్ విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. (school girls hospitalised) టియర్ గ్యాస్ వల్ల ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఈ సంఘటన జరిగింది. శనివారం పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.
కాగా, ఆ సమయంలో గాలి బాగా వీచింది. దీంతో సమీపంలో ఉన్న ప్రభుత్వ స్కూల్లోకి టియర్ గ్యాస్ వ్యాపించింది. ఈ నేపథ్యంలో పలువురు బాలికలు అస్వస్థతకు గురయ్యారు. కళ్ల మంటలతోపాటు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందిపడ్డారు. ఇద్దరు బాలికల పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఎస్పీ వెంటనే స్పందించారు. అంబులెన్స్ ఏర్పాటు చేసి వారిని హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్లు సకాలంలో వైద్యం అందించారు. దీంతో ఆ బాలికల ఆరోగ్యం నిలకడగా ఉందని స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు.
మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు, రాజకీయ నేతలు ఈ సంఘటనపై స్పందించారు. పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు పోలీసులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలా జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.