సిమ్లా: తప్పుడు సమాధానాలు చెప్పిన విద్యార్థుల చెంపపై మరో విద్యార్థితో టీచర్ కొట్టించింది. సరిగా కొట్టనందుకు ఆ స్టూడెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థిని ఫిర్యాదుతో లేడీ టీచర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. (Case on Teacher) హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 24న ప్రభుత్వ బాలికల స్కూల్‌కు చెందిన ఒక ఉపాధ్యాయురాలు సంస్కృత పదాలకు అర్థాలను విద్యార్థులను అడిగింది. క్లాస్ లీడర్ అయిన విద్యార్థిని సరిగా సమాధానాలు చెప్పింది. అయితే క్లాస్‌లోని సుమారు 12 మంది స్టూడెంట్స్ సరిగా సమాధానాలు చెప్పలేదు. దీంతో ఆ విద్యార్థుల చెంపపై కొట్టమని క్లాస్ లీడర్ అయిన విద్యార్థినిని ఆ టీచర్ ఆదేశించింది.
కాగా, ఉపాధ్యాయురాలి ఆదేశాలను ఆ విద్యార్థిని పాటించింది. సరిగా సమాధానం చెప్పని స్టూడెంట్స్ చెంపలపై మెల్లగా కొట్టింది. దీంతో ఆ స్టూడెంట్ పట్ల టీచర్ మండిపడింది. బాలికలను గట్టిగా కొట్టాలని గట్టిగా అరిచింది. ‘నువ్వు క్లాస్ మానిటర్. చెంపపై ఎలా కొట్టాలో కూడా నీకు తెలియదు’ అని తిట్టింది.
మరోవైపు క్లాస్ మానిటర్ అయిన ఆ విద్యార్థిని ఈ సంఘటనపై కలత చెందింది. దీంతో తన తల్లిదండ్రుల సహాయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉపాధ్యాయురాలి ప్రవర్తన తనను భయానికి గురి చేసినట్లు ఆరోపించింది. ‘నా గురించి నీ తల్లిదండ్రులకు ఏమైనా చెప్పుకో. ఎవరూ నన్నేమీ చేయలేరు’ అని గతంలో కూడా పలుసార్లు హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో పిల్లల సంరక్షణ చట్టం, పిల్లల పట్ల క్రూరత్వం సెక్షన్ల కింద ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.