Cancer | న్యూఢిల్లీ : టీ, కాఫీ సేవనం వల్ల తల, మెడ, గొంతు, నోటి క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా తల, మెడ క్యాన్సర్ ఏడో అతి సాధారణ క్యాన్సర్. అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో ఈ క్యాన్సర్ రేట్లు పెరుగుతున్నాయి. కాఫీని సేవించని వారితో పోల్చినపుడు, రోజుకు నాలుగు కప్పుల కన్నా ఎక్కువ కెఫినేటెడ్ కాఫీని తాగేవారికి తల, మెడ క్యాన్సర్ ముప్పు 17 శాతం తక్కువగా ఉంటుందని అధ్యయనం తెలిపింది.
నోరు, నాలుక వంటి భాగాలకు క్యాన్సర్ ముప్పు 30%, గొంతు క్యాన్సర్ ముప్పు 22 శాతం తగ్గుతుందని, గొంతు క్రింది భాగంలో క్యాన్సర్ వచ్చే అవకాశం 41 శాతం తగ్గుతుందని వెల్లడించింది. డీకెఫినేటెడ్ కాఫీ కూడా కొంత వరకు సానుకూల ప్రభావం చూపుతుందని గుర్తించింది. టీ తాగడం వల్ల గొంతు కింది భాగంలో క్యాన్సర్ ప్రమాదం 29 శాతం తగ్గుతుంది. రోజూ ఒక కప్పు లేదా అంతకన్నా తక్కువ టీ తాగడం వల్ల తల, మెడ క్యాన్సర్ ముప్పు 9 శాతం వరకు తగ్గుతుంది. గొంతు కింది భాగంలో క్యాన్సర్ ముప్పు 27 శాతం వరకు తగ్గుతుంది. అయితే రోజుకు ఒకటి కన్నా ఎక్కువ కప్పుల టీ తాగితే, స్వరపేటిక క్యాన్సర్ ముప్పు 38 శాతం ఎక్కువగా ఉంటుంది.