TASMAC scam : తమిళనాడు (Tamil Nadu) లో మద్యం కుంభకోణం (liquor scandal) తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మద్యం కుంభకోణాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (TASMAC) లో జరిగిన ఈ మద్యం కుంభకోణంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం ఆందోళనలకు దిగబోతున్నామని తమిళనాడు బీజేపీ ప్రకటించింది. దాంతో రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పి సెల్వం సహా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తమిళనాడు బీజేపీ నేతలు సోమవారం ఉదయం 11 గంటలకు ఆందోళనకు దిగనున్న తరుణంలో ముందుగానే పోలీసులు వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. మరికొందరు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. సౌందరరాజన్ తన నిర్బంధం గురించి మాట్లాడుతూ.. పోలీసులు తమను ఇళ్ల నుంచి బయటకు వెళ్లనివ్వడం లేదని, తమ కార్యకర్తలు 300 మందిని ఒక కల్యాణ మండపంలో నిర్బంధించారని చెప్పారు. వెయ్యి కోట్ల రూపాయల మద్యం కుంభకోణంపై దర్యాప్తు జరిపించాలని కోరుతున్నామని’ అన్నారు.
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఈ నిర్బంధాలను ఖండించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్టు పెట్టారు. డీఎంకే ప్రభుత్వం భయంతో వణికిపోతోందని, అందుకే బీజేపీ నేతలైన తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పీ సెల్వన్తోపాటు పలువురు రాష్ట్ర, జిల్లా నిర్వాహకులను గృహ నిర్బంధంలో ఉంచిందని విమర్శించారు. తేదీ ప్రకటించకుండా అకస్మాత్తుగా నిరసన ప్రారంభిస్తే ఏం చేయగలరని అన్నామలై ప్రశ్నించారు. కాగా డీఎంకే ప్రభుత్వం బీజేపీ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని, కేంద్ర సంస్థలు పనిచేస్తున్నాయని డీఎంకే నేతలు ఆరోపించారు.