చెన్నై, మే 7: తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఆవిర్భవించినప్పటికీ అధికారం మాత్రం ఇంకా అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ గురువారం వరుసగా రెండో రోజు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న టీవీకే అధినేత విజయ్ ప్రతిపాదనను తిరస్కరించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ గురువారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను మళ్లీ కలిశారు. అయితే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు పొందిన తర్వాతే తిరిగి రావాలని గవర్నర్ ఆయనను కోరారని లోక్‌భవన్ వర్గాలు తెలిపాయి. టీవీకేకు ఇంకా అవసరమైన సంఖ్యాబలం తక్కువగా ఉందని, ప్రమాణ స్వీకార ప్రక్రియ జరగడానికి ముందు 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో తిరిగి రావాలని గవర్నర్ విజయ్‌కు చెప్పినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
దయచేసి 118 సంతకాలతో రండి. టీవీకేకు మెజారిటీ ఉందని నిరూపించండి. అప్పుడు ప్రమాణ స్వీకారం జరుగుతుంది అని గవర్నర్ విజయ్‌తో చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థిరంగా ఉండి, కూలిపోకుండా ఉండేందుకే గవర్నర్ లిఖితపూర్వక మద్దతుపై పట్టుబట్టారని ఆ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ ఇతర పార్టీని ఆహ్వానించబోమని గవర్నర్ విజయ్‌కు హామీ ఇచ్చారని కూడా తెలిపాయి. తమ సంఖ్యా బలానికి మద్దతుగా సంతకాలతో తిరిగి రావాలని టీవీకేను గవర్నర్ కోరారు. ఆ తర్వాత విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏఐఏడీఎంకే నాయకుడు ఎడప్పాడి కే పళనిస్వామి గవర్నర్‌తో ఎలాంటి అపాయింట్మెంట్ కోరలేదని సంబంధిత వర్గాలు చెప్పాయి.
ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 9న ముగియనున్నందున కొత్త ప్రభుత్వంపై నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్ అర్లేకర్‌కు మరి కొన్ని రోజుల వ్యవధి ఉంది. ముందు రోజు కూడా విజయ్ 112 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను కలిశారు. ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ నుంచి విజయ్ మద్దతు పొందినప్పటికీ విజయ్ తనకు పార్టీ అండ ఉందని గవర్నర్‌కు మౌఖికంగా తెలియచేసి సంఖ్యాబలాన్ని మరింత పెంచుకోవడానికి మరికొంత సమయం కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి. అయితే ఈ సంఖ్య సరిపోదని విజయ్‌కు తెలియచేసిన గవర్నర్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో తిరిగి రావాలని కోరినట్లు తెలిసింది. దీంతో మళ్లీ కొత్త యత్నాలకు ఇది నాంది పలుకుతున్నది.
విడుతలై చిరుతైరళ్ కచ్చి(వీసీకే) అధినేత తొల్ తిరుమవళవన్ గురువారం గవర్నర్ అర్లేకర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ను ఆహ్వానించి సభలో తన మెజారిటీని నిరూపించుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. తమిళనాడు రాజకీయాల్లోకి బీజేపీ చొరబడి గందరగోళాన్ని సృష్టిస్తున్నదని స్థానిక మీడియాతో మాట్లాడుతూ తిరుమవళవన్ ఆరోపించారు. ఏకైక అతిపెద్ద పార్టీ నాయకుడిగా ఉన్న విజయ్ను పదవీ బాధ్యతలు చేపట్టేందుకు, ఆ తర్వాత అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకునేందుకు అనుమతించాలని ఆయన కోరారు. ఇప్పుడు బీజేపీ లేదా అమిత్ షా, మోదీ తమిళనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకుని గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. టీవీకేని ఏకైక అతిపెద్ద పార్టీగా ప్రజలు ఎంచుకున్నారు.
అందువల్ల ఆయనను పదవీ బాధ్యతలు చేపట్టడానికి అనుమతించాలి. రాజ్యాంగం కూడా అదే నిర్దేశిస్తున్నది అని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను గవర్నర్ ఆహ్వానించకపోవడాన్ని తీవ్రంగా విమర్శించిన ఎంఎన్ఎం నేత కమల్ హాసన్ ఇది తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవపర్చడం, అవమానపర్చడమేనని అన్నారు. డీఎంకే నేత ఏ శరవణన్ కూడా విజయ్‌కు మద్దతుగా నిలిచారు. ఎన్నికల ముందు ఎలాంటి పొత్తులు పెట్టుకోకుండా అతి పెద్ద పార్టీగా నిలిచిన టీవీకేను ఆహ్వానించడం సముచితమని అన్నారు.
రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని సీపీఐ తమిళనాడు విభాగం గవర్నర్‌ను అర్థించింది. ప్రమాణ స్వీకారానికి ముందే మెజారిటీని నిరూపించుకోవాలని విజయ్ను గవర్నర్ కోరడం సబబు కాదని సీపీఐ పేర్కొన్నది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ పార్టీలను దిగ్భ్రాంతికి గురిచేసి డీఎంకే-ఏఐఏడీఎంకే పార్టీల మూడు దశాబ్దాల ద్విఛత్రాధిపత్యానికి టీవీకే చరమగీతం పాడింది. రెండు నియోజకవర్గాల్లో గెలుపొందిన విజయ్ ఒక నియోజకవర్గాన్ని వదులుకోవలసి ఉంటుంది. ఈ కారణంగా అసెంబ్లీలో టీవీకే బలం 107కి తగ్గుతుంది. కాంగ్రెస్‌తో కలిపి టీవీకే బలం 112 మంది ఉండగా మెజారిటీ మార్కు దాటడానికి మరో ఆరుగురు సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం ముఖ్యమంత్రిని నియమించే అధికారం గవర్నర్‌కు ఉంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడిన సందర్భంలో ముఖ్యమంత్రి పదవికి సరైన అభ్యర్థిని నిర్ణయించే విచక్షణాధికారాన్ని కూడా రాజ్యాంగం గవర్నర్‌కు కల్పించింది. గతంలో అనేక సందర్భాల్లో ఆయా రాష్ర్టాల్లో గవర్నర్లు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అతిపెద్ద పార్టీ నాయకుడిని ఆహ్వానించడం జరిగింది. కొంత వ్యవధినిచ్చి మెజారిటీని నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
టీవీకే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తమిళనాడు గవర్నర్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) ప్రకటించింది. లోక్ భవన్(గవర్నర్ నివాసం) తోటలో ప్రభుత్వాలను నిర్ణయించలేరని, అసెంబ్లీలో వాటిపై నిర్ణయం జరుగుతుందని టీఎన్‌సీసీ ఒక ప్రకటనలో విమర్శించింది. కాగా, తమ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతును కోరుతూ టీవీకే చేసిన విజ్ఞప్తిపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ తెలిపాయి. టీవీకే నాయకుడు సీటీఆర్ నిర్మల్ కుమార్ గురువారం ఈ పార్టీల నాయకులకు ఫోన్ చేసి తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.
వామపక్షాలు సహా తమతో పొత్తులో ఉన్న భాగస్వామ్య పక్షాలు సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్(ఎస్పీఏ)లోనే కొనసాగాలని డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్న ఎంకే స్టాలిన్ కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ టీవీకేకు ఇప్పటికే మద్దతు ప్రకటించింది. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి ప్రజాస్వామిక సంప్రదాయాలను గౌరవించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ గురువారం తమిళనాడు గవర్నర్ అర్లేకర్‌కు పిలుపునిచ్చారు. 1996లో బీజేపీ దిగ్గజం అటల్ బిహారీ వాజ్‌పేయిని ప్రభుత్వ ఏర్పాటుకు అప్పటి రాష్ట్రపతి ఆహ్వానించిన చారిత్రాత్మక ఘట్టాన్ని ఆయన గుర్తుచేశారు. గవర్నర్ కార్యాలయం అనుమానాలకు అతీతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ పోరాటం తీవ్రతరం అయిన నేపథ్యంలో అధికారంలో భాగస్వామ్యంపై టీవీకే, ఏఐఏడీఎంకేలోని ఒక వర్గం మధ్య చర్చలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పుదుచ్చేరిలోని ఒక ప్రైవేట్ రిసార్టుకు 28 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలను తరలించిన దరిమిలా ఈ పరిణామం చోటుచేసుకుంది. పూరన్కుప్పంలోని ఒక రిసార్టులో బస చేసిన ఈ ఎమ్మెల్యేలు ఏఐఏడీఎంకే సీనియర్ నాయకుడు షణ్ముగం మద్దతుదారులు. ప్రభుత్వ ఏర్పాటులో టీవీకే అధినేత విజయ్‌కు మద్దతు ఇవ్వాలని ఏఐఏడీఎంకేలోని ఒక వర్గం పట్టుబడుతున్నట్లు తెలుస్తున్నది.
అధికార పంపకంపై కూడా చర్చలు జరుగుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏఐఏడీఎంకే సీనియర్ నాయకుడు సీవీ షణ్ముగంకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతోపాటు కొన్ని కీలక పదవులను తమ ఎమ్మెల్యేలకు ఇవ్వడానికి విజయ్ సంసిద్ధత తెలియచేయవచ్చని ఆ వర్గాలు చెప్పాయి. చర్చల్లో షణ్ముగం, టీవీకే అభ్యర్థి కేఏ సంగొట్టియన్ పాల్గొంటున్నట్లు వారు తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనను ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి అంగీకరించకపోవడంతో పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయని తెలుస్తున్నది.