Firecrackers ban | తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. దీపావళి పండగ సందర్భంగా టపాసులపై పూర్తి నిషేధం విధించవద్దని, దేశ రాజధానిలో పటాకుల విక్రయాలకు అనుమతించాలని తన లేఖలో కేజ్రీవాల్‌ను కోరారు. తమిళనాడులో పెద్ద ఎత్తున దీపావళి టపాసులు తయారవుతాయి. టపాసులను నిషేధించడం ద్వారా తమ రాష్ట్రంలోని వారికి నష్టం వస్తున్నందున పూర్తి నిషేధం విధించవద్దని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో టపాసుల తయారీ, అమ్మకం, వినియోగంపై ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ పూర్తి నిషేధం విధించింది. తమిళనాడు శివకాశీ వార్షికాదాయంలో 70 శాతం ఆదాయం టపాసుల అమ్మకం ద్వారా వస్తుంది. తమ రాష్ట్రంలోని వ్యాపారులు ఆర్థికంగా లాభపడేలా దీపావళికి టపాసులు అమ్ముకునేలా అనుమతించాలని స్టాలిన్ తన లేఖలో కేజ్రీవాల్‌కు విజ్ఞప్తిచేశారు. ఇతర రాష్ట్రాల్లో పూర్తి నిషేధం విధించని విషయాన్ని తన లేఖలో కేజ్రీవాల్ దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకైనా టపాసులు విక్రయించేందుకు అనుమతించాలని కోరారు.
తమిళనాడు విరుదునగర్ జిల్లా పరిధిలోని శివకాశి నగరం భారతదేశంలోనే బాణసంచా తయారీదారుల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 6.5 లక్షల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. దీపావలి పండగ రోజున రెండు గంటల పాటు క్రాకర్స్ కాల్చుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే, ఢిల్లీ ప్రభుత్వం మాత్రం టపాసుల ఉత్పత్తి, అమ్మకం, వినియోగంపై పూర్తి నిషేధం విధించింది. ఇలా పూర్తి నిషేధం విధించడం ఇది వరుసగా మూడోసారి. ఫలితంగా దేశ రాజధాని నగరంలో టపాసులు కనిపించడం లేదు.