మధురై, ఆగస్టు 21 : బీజేపీ తన భావజాల శత్రువని తమిళ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ ప్రకటించారు. ఫాసిస్టు శక్తులతో చేతులు కలిపే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులోని మదురై-తూత్తుకుడి జాతీయ రహదారిపైన మదురై జిల్లాలోని పరపత్తిలో గురువారం జరిగిన పార్టీ రాష్ట్ర సమావేశంలో విజయ్ ప్రసంగించారు. ఎన్ని కుతంత్రాలు చేసినా తమిళనాడులో బీజేపీ గెలవడం అసంభవమని జోస్యం చెబుతూ కమలంపై నీరు నిలవదని చమత్కరించారు. తమిళనాడులో ఏపార్టీతో పొత్తుపెట్టుకున్నప్పటికీ బీజేపీ గెలిచే అవకాశం లేదని ఆయన పరోక్షంగా అన్నాడీఎంకేని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమిళనాడుకు చెందిన మత్స్యకారులు తరచు శ్రీలంక నేవీకి చిక్కి బందీలుగా మారుతున్న ఘటనలను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి వారి వెతలు పట్టవని ఆరోపించారు. కచ్చతీవును భారత్ తిరిగి స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు.
ఆర్ఎస్ఎస్కి బానిసగా తమ పార్టీ ఉండబోదని విజయ్ స్పష్టం చేశారు. లౌకిక ఫ్రంట్ అని చెప్పుకుంటున్న మరో గ్రూపు ప్రజలను మోసం చేస్తోందని ఆయన పరోక్షంగా డీఎంకే సారథ్యంలోని ఇండియా కూటమిని ఉద్దేశించి ఆరోపించారు. ప్రతిపక్షాలు తమిళనాడు అస్తిత్వాన్ని తగ్గిస్తున్నాయని మండిపడ్డారు. ఏ కూటమిలో చేరి తమ అస్థిత్వాన్ని కోల్పోబోమని, తాము ఆత్మాభిమానంతో పోరాటం సాగిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని చిన్న పార్టీలు తనతో కలసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
అధికార డీఎంకేని తన రాజకీయ విరోధిగా విజయ్ ప్రకటించారు. తనను తాను సింహంతో పోల్చుకుంటూ పార్టీ కార్యకర్తలను సింహం పిల్లలుగా సంబోధించారు. ఒంటరిగా ఎలా నిలబడాలి, ఎంత నిబ్బరంగా ఉండాలో సింహానికే తెలుసునని, అడవిలో ఎన్నో గుంటనక్కలు, ఇతర జంతువులు ఉన్నాయని, అయితే ఒకే ఒక సింహం ఉంటుందని విజయ్ చెప్పారు. ఎంత ఆకలి మీదున్నా సింహం గడ్డి తినదని, ఆకలి మీదున్న సింహం దేన్నయినా వేటాడితే దొరికేదాకా వదలదని చెప్పారు.
ఎనిమిది నెలల్లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే, డీఎంకే మధ్యనే ప్రత్యక్ష పోరు ఉంటుందని విజయ్ చెప్పారు. తాను మధురై తూర్పు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు. మధురై పరిసరాల్లో ఉన్న మరి కొన్ని అసెంబ్లీ స్థానాలకు కూడా టీవీకే అభ్యర్థులు కొందరి పేర్లను ఆయన సమావేశంలో ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలలో టీవీకే పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. మహిళలు, బాలికలు, వృద్ధుల భద్రతే తమ పార్టీ మొదటి ప్రాధాన్యతని ఆయన ప్రకటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేని ఇంటికి పంపిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.