TVK | తమిళ నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK) మధురైలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ రహస్య ఒప్పందాలు చేసుకునే పార్టీ కాదని.. పొత్తుల కోసం అబద్ధాలు చెప్పడం, ప్రజలను మోసం చేసే పార్టీ కాదన్నారు. తమిళనాడు ప్రజలు, మహిళల, యువత తనతోనే ఉన్నారన్నారు. టీవీకే రాజకీయ లాభం కోసం కాకుండా.. ప్రజల సమస్యలను తీర్చేందుకు ఏర్పడిన పార్టీయేనన్నారు. తన ప్రసంగంలో తమిళనాడు మత్స్యకారులపై శ్రీలంక నావికాదళం చేసిన దాడులను సైతం ప్రస్తావించారు. ఇప్పటి వరకు 800 మంది మత్స్యకారులపై దాడి జరిగిందని విజయ్ పేర్కొన్నారు. కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. ఇది మత్స్యకారుల డిమాండ్ మాత్రమే కాదని.. తమిళనాడు గౌరవానికి సంబంధించిందన్నారు.
మీరు కచ్చతీవు దీవులను తీసుకురాగలరా? అని ప్రధానిని ప్రశ్నించారు. బీజేపీ తన సైద్ధాంతిక శత్రువని.. డీఎంకే రాజకీయ ప్రత్యర్థి అని విజయ్ స్పష్టం చేశారు. టీవీకే తక్షణ రాజకీయ లాభం కోసం స్థాపించలేదని.. ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పోరాడుతుందన్నారు. టీవీకే చీఫ్ తన ప్రసంగంలో సామాజిక సమస్యలను ప్రస్తావించారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతే తమ పార్టీ తొలి ప్రాధాన్యమని.. రైతులు, యువత, లింగమార్పిడి సమాజం, నిస్సహాయ వృద్ధులు, శారీరకంగా బలహీనంగా ఉన్నవారికి ప్రత్యేక మద్దతు ఇచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తమ పార్టీ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని విజయ్ అన్నారు. విజయ్ తన ప్రసంగాన్ని ‘సింహం ఎప్పుడూ వినోదం కోసం బయటకు రాదు.. వేటాడేందుకు బయటకు వస్తుంది’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. టీవీకే కేవలం రాజకీయాల కోసం కాదని.. ప్రజల కోసం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందని విజయ్ సందేశమిచ్చారు.