చెన్నై : కరోనా థర్డ్ వేవ్ కారణంగా మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మళ్లీ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో తరగతులు పునః ప్రారంభించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. ఒకటి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని, ప్లే స్కూల్స్, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు తరగతులు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో 10 -12 తరగతులకు సంబంధించిన బోర్డు పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నట్లు తెలిపింది.
బోర్డు పరీక్షలకు ముందు మొదటి రివిజన్ పరీక్షలు జనవరిలో, రెండో రివిజన్ పరీక్షలు మార్చిలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యమొళి గతంలో ప్రకటించారు. నవంబర్ నుంచి తమిళనాడు వ్యాప్తంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అదనంగా మరో వారం రోజుల పాటు తరగతులు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. మరో వైపు ప్రభుత్వం శుక్రవారం నుంచి రాత్రిపూట కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. రెస్టారెంట్లు, సెలూన్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు, యోగా సెంటర్లు 50శాతం ఆక్యుపెన్సీతో కొనసాగుతాయని స్పష్టం చేసింది.