GST | కోయంబత్తూర్: ఆహార పదార్థాలపై కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) వసూలు చేస్తుండటం పట్ల తమిళనాడులో ఓ రెస్టారెంట్ యజమాని బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను వ్యక్తిగతంగా కలిసి తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. ఈ వ్యక్తిగత సంభాషణకు సంబంధించిన వీడియోను బీజేపీ లీక్ చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై విపక్ష నేతలు, నెటిజన్లు మండిపడటంతో తమిళనాడు రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు అన్నామలై క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. కోయంబత్తూరు జిల్లాలోని వ్యాపారులు ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో అన్నపూర్ణ రెస్టారెంట్ చైన్ యజమాని, తమిళనాడు హోటల్ యజమానుల సమాఖ్య చైర్మన్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ఆహార పదార్థాలపై నానా రకాలుగా జీఎస్టీ వసూలు చేస్తుండటం వల్ల రెస్టారెంట్ల యజమానులకు ఎదురవుతున్న సమస్యలను ఏకరువు పెట్టారు.
రొట్టె (బన్)లపై ఎలాంటి పన్ను విధించకపోయినప్పటికీ క్రీమ్‌తో కూడిన రొట్టెలపై 18% పన్ను విధించడాన్ని తప్పుపట్టారు. స్వీట్లపై 5%, బిస్కెట్లపై 12%, క్రీమ్ ఫిల్డ్ బన్స్‌పై 18% చొప్పున పన్ను వసూలు చేస్తుండటంపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. ఆ సమావేశం ముగిశాక ఆయన వ్యక్తిగతంగా సీతారామన్‌ను కలిసి, తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. ఆ సమయంలో కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాసన్ (బీజేపీ) అక్కడ ఉన్నారు. అనంతరం ఆ వ్యక్తిగత సంభాషణ వీడియోను తమిళనాడు బీజేపీ సోషల్ మీడియా సెల్ కన్వీనర్ ‘ఎక్స్’లో షేర్ చేయడం దుమారాన్ని రేపింది.
బీజేపీ తీరుపై కాంగ్రెస్, డీఎంకే నేతలతోపాటు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాసన్ పట్ల బీజేపీ తలబిరుసుతో అమర్యాదకరంగా వ్యవహరించిందని, ఆయనతో నిర్మలా సీతారామన్‌కు బలవంతంగా క్షమాపణ చెప్పించినట్టు కనిపిస్తున్నదని మండిపడ్డారు. జీఎస్టీలో ఉన్న లొసుగులను వివరించి, విలువైన ప్రశ్న అడిగినందుకు వ్యాపారవేత్త శ్రీనివాసన్‌ను బీజేపీ ఘోరంగా అవమానించిందని ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత సుమంత్ సీ రామన్ లాంటివారు సైతం ధ్వజమెత్తడంతో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. శ్రీనివాసన్‌కు, నిర్మలా సీతారామన్‌కు మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణ వీడియోను బీజేపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేయడంపై విచారం వ్యక్తం చేస్తూ.. శ్రీనివాసన్‌కు క్షమాపణ చెప్పారు.