Governor sue | తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే బహిష్కృత నేతపై తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పరువునష్టం దావా నమోదు చేశారు. డీఎంకే పార్టీ నుంచి సస్పెండ్ అయిన శివాజీ కృష్ణమూర్తిపై చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ వర్గాలు ధ్రువీకరించాయి.
జనవరి ప్రారంభ రోజుల్లో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ఆమోదించిన ప్రసంగంలోని కొన్ని భాగాలను దాటవేయడంతో గవర్నర్ ఆర్ఎన్ రవిపై శివాజీ కృష్ణమూర్తి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు.
గవర్నర్‌గా రాజ్యాంగంపై ప్రమాణం చేయలేదా అని ప్రశ్నిస్తూ.. అంబేద్కర్ పేరు చెప్పుకోలేకపోతే కశ్మీర్‌కు వెళ్లాలని, అప్పుడే ఆయన్ను తీవ్రవాదులు కాల్చి చంపగలుగుతారని గవర్నర్ రవిపై ఆయన తీవ్రంగా దూషించారు. కాగా, ఈ వివాదానికి దూరంగా ఉండాలని భావించిన డీఎంకే గత వారం శివాజీ కృష్ణమూర్తిని పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు, పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చారన్న ఆరోపణలపై పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
తమిళనాడులో గవర్నర్ – రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గవర్నర్ రవి బీజేపీ ఆదేశానుసారం పనిచేస్తున్నారని అధికార పార్టీ డీఎంకే ఆరోపిస్తున్నది. ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం ఆమోదించిన అధికారిక ప్రసంగాన్ని చదువుతున్నప్పుడు గవర్నర్ స్క్రిప్ట్‌ను రద్దు మార్చడంతో శత్రుత్వం పెరిగింది. సెక్యులరిజం గురించి ప్రస్తావించిన కొన్ని భాగాలను దాటవేసిన గవర్నర్.. పెరియార్, బీఆర్ అంబేద్కర్, కే కామరాజ్, సీఎన్ అన్నాదురై, కరుణానిధి వంటి నాయకులను ప్రస్తావించారు. దాంతో అధికార, విపక్ష సభ్యులు గవర్నర్‌కు వ్యతిరేకంగా సభలో నినాదాలు చేశారు. దాంతో గవర్నర్ రవి సభ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించారు.