చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. (Tamil Nadu Governor) జాతీయ గీతాన్ని అవమానించినట్లు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సంప్రదాయంగా సభ నుద్దేశించి ప్రసంగించేందుకు ఆయన నిరాకరించి వెళ్లిపోయారు. ఆ రాష్ట్రంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సంప్రదాయం ప్రకారం సభ సమావేశమైనప్పుడు రాష్ట్ర గీతం తమిళ్ థాయ్ వాల్తు, సభ ముగిసిన తర్వాత చివరలో జాతీయ గీతం ఆలపిస్తారు. అయితే ఈ నిబంధన మార్చాలని గవర్నర్ రవి డిమాండ్ చేశారు. సభ ప్రారంభంలో కూడా జాతీయ గీతం ఆలపించాలని సభా నాయకుడైన సీఎం స్టాలిన్, స్పీకర్ ఎం అప్పావును కోరారు. వారు నిరాకరించడంతో గవర్నర్ రవి సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ చదవాల్సిన సంప్రదాయ ప్రసంగాన్ని స్పీకర్ ఎం అప్పావు చదివి వినిపించారు.
కాగా, అసెంబ్లీ నుంచి గవర్నర్ రవి వాకౌట్‌పై రాజ్‌భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు అసెంబ్లీలో భారత రాజ్యాంగం, జాతీయ గీతాన్ని మరోసారి అవమానించినట్లు ఆరోపించింది. ‘జాతీయ గీతాన్ని గౌరవించడం మన రాజ్యాంగంలో పొందుపరిచిన మొదటి ప్రాథమిక విధి. అన్ని రాష్ట్రాల శాసనసభల ప్రారంభం, చివరిలో జాతీయ గీతాన్ని పాడతారు. ఇవాళ తమిళనాడు అసెంబ్లీ ప్రారంభంలో తమిళ గీతం మాత్రమే పాడారు. జాతీయ గీతం కూడా పాడాలన్న గవర్నర్ విన్నపాన్ని నిరాకరించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని, జాతీయతను అగౌరవపరిచే విషయంలో గవర్నర్ తీవ్ర ఆందోళన చెంది సభ నుంచి వెళ్లిపోయారు’ అని పేర్కొంది.
మరోవైపు గత ఏడాది ఫిబ్రవరిలో కూడా గవర్నర్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ప్రసంగం ప్రతి పెద్దగా ఉందని ఆరోపించారు. అలాగే బీఆర్ అంబేద్కర్, పెరియార్, సీఎన్ అన్నాదురై పేర్లతో పాటు ‘ద్రావిడియన్ మోడల్’ అనే పదం, శాంతిభద్రతలకు సంబంధించిన ప్రసంగంలోని భాగాలను చదవడానికి ఆయన నిరాకరించి సభ నుంచి వెళ్లిపోయారు.