చెన్నై, నవంబర్ 16: సుప్రీంకోర్టు మందలించిన వారం రోజులకు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి స్పందించారు. ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన పది పెండింగ్ బిల్లులను ఆయన గురువారం తిప్పి పంపారు. గవర్నర్లు బిల్లులను తొక్కి పెట్టడం తీవ్రమైన అంశం అని సుప్రీంకోర్టు.. తమిళనాడు, పంజాబ్ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.
గవర్నర్లు నిప్పుతో చెలగాటమాడుతున్నారని విమర్శించింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకుండా వాటిని తిప్పి పంపారు. ఈ బిల్లులను తిరిగి వచ్చిన కొద్ది వ్యవధిలోనే తమిళనాడు స్పీకర్ ఎం అప్పావు శనివారం ప్రత్యేక శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆ బిల్లులను యథాతథంగా మరోమారు ఆమోదించి తిరిగి గవర్నర్కు పంపనున్నట్టు తెలుస్తున్నది. ఇలా రెండోమారు వచ్చిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపడం తప్పనిసరి.