చెన్నై: కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచన మేరకే మంత్రి బాలాజీని తొలగించే ఉత్తర్వులను తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వెనక్కి తీసుకున్నారు. ఈ వివాదస్పద నిర్ణయానికి సంబంధించి సీఎం ఎంకే స్టాలిన్‌కు రాసిన రెండు లేఖల్లో ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. మంత్రి వీ సెంథిల్ బాలాజీని మనీల్యాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన జైలులో ఉండటంతో గవర్నర్ ఆర్ఎన్ రవి గురువారం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. మంత్రి బాలాజీని మంత్రిమండలి నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఐదు గంటల తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
కాగా, గవర్నర్ ఆర్ఎన్ రవి తీసుకున్న ఈ వివాదస్పద నిర్ణయాన్ని అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు తప్పుపట్టాయి. సీఎం ఎంకే స్టాలిన్‌ను సంప్రదించకుండా బాలాజీని మంత్రి పదవి నుంచి ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించిన గవర్నర్ రవి తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
మరోవైపు గవర్నర్ ఆర్ఎన్ రవి తన చర్యను సమర్థించుకున్నారు. దీనికి సంబంధించి సీఎం ఎంకే స్టాలిన్‌కు రెండు లేఖలు రాశారు. సాధారణ పరిస్థితులలో మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్ వ్యవహరిస్తారనే వాస్తవం తనకు తెలుసని అన్నారు. అయితే, మనీలాండరింగ్ వంటి అనేక అవినీతి కేసులు, తీవ్రమైన క్రిమినల్ చర్యలు ఎదుర్కొంటున్న వీ సెంథిల్ బాలాజీని మంత్రిగా కొనసాగించాలన్న మీ పట్టుదల పక్షపాతాన్ని ప్రతిబింబిస్తోందని గవర్నర్ పేర్కొన్నారు.
కాగా, బాలాజీ మంత్రిగా కొనసాగితే న్యాయ ప్రక్రియకు ఆటంకం కలుగడంతోపాటు న్యాయానికి విఘాతం కలుగుతుందని గవర్నర్ తెలిపారు. అలాంటి పరిస్థితి రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి దారితీయవచ్చని అభిప్రాయపడ్డారు. అటువంటి పరిస్థితులలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 154, 163, 164 కింద తనకు దక్కిన అధికారాల మేరకు వీ సెంథిల్ బాలాజీని మంత్రి మండలి నుంచి తొలగించినట్లు ఐదు పేజీల తొలి లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు, ఐదు గంటల తర్వాత తన ఉత్తర్వును ఎందుకు వెనక్కి తీసుకున్నది అన్నది కూడా గవర్నర్ ఆర్ఎస్ రవి మరో లేఖ ద్వారా స్పష్టం చేశారు. బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగించడంపై అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని కోరాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు సలహా ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అటార్నీ జనరల్‌ను సంప్రదిస్తున్నట్లు తెలిపారు. అప్పటి వరకు బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వును పెండింగ్‌లో ఉంచుతున్నట్లు గురువారం రాత్రి 11.45 గంటలకు సీఎం స్టాలిన్‌కు రాసిన రెండో లేఖలో గవర్నర్ పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వ్వవహారాల్లో కేంద్రం పెత్తనం మరోసారి స్పష్టమైంది.
TN Gov Letter