Tamil Nadu | తమిళనాడులో గతంలో మిత్రపక్షాలుగా కొనసాగిన బీజేపీ, ఏఐఏడీఎంకే పార్టీలు ప్రస్తుతం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టగా మద్దతు లభిస్తున్నది. ఇది అన్నాడీఎంకే పార్టీకి మింగుడుపడడం లేదు. అన్నామలైపై ఆ పార్టీ విమర్శలకు దిగుతున్నది. తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ, ఏఐఏడీఎంకే పోరు కొనసాగుతున్నది. రెండు పార్టీల మధ్య పంచాయితీతో అధికార డీఎంకే కలిచివచ్చింది. వచ్చే లోక్సభ ఎన్నికల కోసం డీఎంకే కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుపుతున్నది.
దాంతో పాటు ఎన్నికల కోసం మేనిఫెస్టోను సైతం సిద్ధం చేస్తున్నది. కాంగ్రెస్, విడుతలై చిరుతైగల్ కట్చి, వామపక్షాలతో పొత్తుకు డీఎంకే సిద్ధమైంది. దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం, పట్టాలి మక్కల్ కట్చి పార్టీలు పొత్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ, ఏఐఏడీఎంకే పార్టీలు సైతం కూటముల కోసం ప్రయత్నాలు జరుపుతున్నాయి. అన్నామలై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక అన్నాడీఎంకే నాయకత్వం ఈ పళనిస్వామి చేతుల్లోకి వెళ్లిన తర్వాత రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతింటూ వస్తున్నాయి.
రాష్ట్రంలోని మైనారిటీల ఓట్లను పొందేందుకు యూనిఫాం సివిల్ కోడ్ సహా కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలను పళనిస్వామి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీంతో బీజేపీకి పళనస్వామి అంటే ఇష్టపడడం లేదు. అన్నాడీఎంకేలో మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వంకే బీజేపీ ప్రాధాన్యం ఇస్తున్నది. మరో వైపు బీజేపీ అంటేనే అన్నాడీఎంకే మండిపడుతున్నది. ఇందు కారణాలు సైతం లేకపోలేదు. ఇటీవల కాలంలో దాదాపు 12 మంది కీలక నేతలు బీజేపీలో చేరారు. ఇందులో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.
వీరితో పాటు డీఎంకే, కాంగ్రెస్, డీఎండీకేలకు చెందిన ఒక్కో మాజీ ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరారు. అయితే, అన్నామలై, బీజేపీలపై అన్నాడీఎంకే మాజీ మంత్రి డీ జయకుమార్ విమర్శలు గుప్పించారు. బురదలో కప్పబడిన గుర్రం లాంటివాడని, దానిపై నీరు పడగానే.. అతని నిజ స్వరూపం బయటకు వస్తుందంటూ విమర్శించారు. అన్నామలై రాజకీయ అనుభవం లేని వ్యక్తి అన్నారు. అయితే, డీఎంకే, ఏఐఏడీఎంకే అవినీతి, అరాచకాలను ప్రోత్సహిస్తున్నాయని అన్నామలై ఆరోపిస్తున్నారు.