Tamil Nadu | తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకున్నది. తిరుప్పూర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని కొందరు వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. పల్లడం సమీపంలోని కల్లకినరులో బియ్యం వ్యాపారం చేస్తున్న సెంథిల్ కుమార్ (47) అనే వ్యక్తి తనకు చెందిన ఖాళీ స్థలంలో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తున్న ఇక్కడ ఎందుకు తాగుతున్నారని.. ఇక్కడ తాగొద్దంటూ సూచించాడు. దాంతో మద్యం తాగుతున్న వ్యక్తులు సెంథిల్‌పై కొడవళ్లతో దాడి చేశారు.
దీన్ని గమనించిన సెంథిల్ కుటుంబ సభ్యులుమోహన్రాజ్, రత్నాంబల్, పుష్పవతి అతన్ని కాపాడేందుకు అక్కడికి వెళ్లగా నిందితులు.. వీరిపై సైతం కిరాతకంగా దాడి చేయడంతో నలుగురు అక్కడికక్కడే కుప్పకూలారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సెంథిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. మరో ముగ్గురి మృతదేహాలను తరలించకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.
అయితే, ఈ హత్యలో సెంథిల్‌కుమార్ దుకాణంలోనే పని చేసిన వెంకటేశన్ అలియాస్ కుట్టి హత్య కేసులో హస్తం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మృతుల్లో బీజేపీ స్థానిక యూనిట్ ఆఫీసర్ బేరర్ మోహన్‌రాజ్ సైతం ఉన్నాడు. బీజేపీ నేతకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సంతాపం ప్రకటించారు. తమ ఇంటి దగ్గరలో మద్యం సేవించడంపై అభ్యంతరం చెప్పడం వల్లనే హత్యకు గురయ్యారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సెంథిల్ ఇంటికి దగ్గరలో కొందరు మద్యం సేవిస్తుండగా.. ఇక్కడ తాగొద్దని చెప్పేందుకు వెళ్లగా.. మద్యం తాగుతున్న వ్యక్తులతో గొడవ జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ హత్య వెనుక సెంథిల్ కుమార్ షాప్‌లో పని చేసిన వ్యక్తి ఉందని చెబుతున్నారు. సెంథిల్ కుమార్ మందలించి వెను తిరిగిన వెంటనే.. కొడవళ్లు, కత్తులతో దాడి చేసి చంపగా.. ప్రణాళిక ప్రకారమే హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.