చెన్నై: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమిళనాడును మోసం చేసిందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ఆరోపించారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్‌ను శుక్రవారం ఆయన శాసనసభకు సమర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై ఆయన విరుచుకుపడ్డారు. ద్విభాషా విధానం విజయవంతమైందని చెప్పారు. హిందీని రుద్దుతున్నారన్న ఆరోపణలను ఉపసంహరించుకునే వరకు, జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసే వరకు నిధులను విడుదల చేయబోమని ధర్మేంద్ర చెప్పారని తెన్నరసు ఆరోపించారు.
దీనిని బ్లాక్‌మెయిల్‌గా సీఎం స్టాలిన్ అన్నారని, దీంతో ఇరువురి మధ్య భీకర వాగ్వాదం జరిగిందని చెప్పారు. కేంద్రం రూ.2,152 కోట్లను విడుదల చేయకుండా తమిళుల్ని మోసగించిందన్నారు. ఎన్ఈపీని అంగీకరించనందుకే ఇలా చేసిందన్నారు. ఎన్ఈపీ త్రిభాషా విధానాన్ని ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులను కేటాయిస్తున్నదన్నారు.