చెన్నై, జూన్ 11: బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నిర్మలా సీతారామన్, జైశంకర్‌కు కేంద్ర క్యాబినెట్లో చోటు కల్పించి, ముస్లిం వర్గానికి చెందిన ఒక్కరికి కూడా మంత్రివర్గంలో చోటివ్వకపోవడంపై తమిళనాడులోని డీఎంకే వర్గాలు, ద్రవిడవాదులు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘3 శాతం నూలిబాన్స్’కు మంత్రివర్గంలో చోటిచ్చారు.. 18 శాతమున్న ముస్లింలకు కేంద్ర మంత్రి అయ్యే అర్హత లేదా?’ అంటూ డీఎంకే అధికార ప్రతినిధి తమిళన్ ప్రసన్న ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బ్రాహ్మణులను తాలిబాన్లతో పోల్చుతూ డీఎంకే వర్గాలు, ద్రవిడవాదులు తమిళనాట ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన పదమే ‘నూలిబాన్స్’. వామపక్ష వాదులు కూడా దీనికి గొంతు కలుపుతున్నారు. ఎలాంటి అర్హతలూ లేని నిర్మలా సీతారామన్‌కు కేంద్రమంత్రి పదవి ఇచ్చారు. దేశ జనాభాలో 18 శాతమున్న ముస్లింలకు అర్హత లేదని.. ఎలా నిర్ణయిస్తారు?’ అంటూ ప్రసన్న టీవీ డిబేట్లో రెచ్చిపోయారు.