చెన్నై: తమిళనాడులో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే, రాజ్యసభలో ప్రవేశానికి సిద్ధమైంది. ఆ పార్టీ ఒక స్థానం దక్కించుకోనున్నది. రాజ్యసభలోని 26 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. (TVK Set For Rajya Sabha Entry) ప్రతి రెండేళ్లకు ఖాళీ అయ్యే స్థానాలను భర్తీ చేయనున్నారు.
కాగా, ఈ 26 స్థానాలకు సంబంధించి 12 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో చెరో నాలుగు స్థానాలకు, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో చెరో మూడు స్థానాలకు, జార్ఖండ్లో రెండు స్థానాలకు, మణిపూర్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్లో ఒక్కో స్థానానికి జూన్ 18న పోలింగ్ జరుగనున్నది. అలాగే మహారాష్ట్ర, తమిళనాడులోని చెరొక రాజ్యసభ స్థానాలకు అదే రోజున ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
మరోవైపు ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలు జరుగనున్న 26 స్థానాల్లో ఎన్డీయే 18, కాంగ్రెస్ 4, వైఎస్సార్ కాంగ్రెస్ 3, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఒక స్థానాన్ని కలిగి ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల తర్వాత ఎన్డీయే ఒక స్థానాన్ని కోల్పోనున్నది. దీంతో దాని సంఖ్య 17కు తగ్గుతుందని అంచనా. అదే సమయంలో కాంగ్రెస్ స్థానాల సంఖ్య 4 నుంచి 5కు పెరుగవచ్చని తెలుస్తున్నది. జేఎంఎం కూడా రెండు స్థానాలను కైవసం చేసుకోనున్నది.
అలాగే తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే కూడా రాజ్యసభలో అడుగుపెట్టనున్నది. ఆ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకోనున్నది. మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ అజిత్ పవర్ వర్గం కూడా ఒక స్థానాన్ని గెలుచుకుంటుందని అంచనా. ఈ రెండు స్థానాలకే ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల నిర్దిష్ట పదవీకాలం కేవలం రెండేళ్లు మాత్రమే.