Population | న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై మరోసారి చర్చ మొదలయ్యింది. త్వరలో జనగణన చేపట్టి, కొత్త జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభ నియోజకవర్గాలను కేంద్రం పునర్విభజన చేయనుందనే ప్రచారం జరుగుతున్నది. ఇదే జరిగితే దక్షిణాది రాష్ర్టాలకు తీరని అన్యాయం జరగనుంది. మరోవైపు లోక్‌సభతో పాటు దేశ రాజకీయాల్లో ఉత్తరాది రాష్ర్టాల ప్రాబల్యం పెరగనుంది. కేంద్రంలో అధికారంలో ఎవరుండాలనేది నిర్ణయించడంలో దక్షిణాది రాష్ర్టాల పాత్ర తగ్గిపోనున్నది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో ఇది చర్చనీయాంశంగా మారింది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ… ‘ఇప్పుడు చిన్న కుటుంబం వద్దని, 16 మంది పిల్లలను కని, పెంచాలని ప్రజలు అనుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి’ అని వ్యాఖ్యానించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడు సహా జనాభా నియంత్రణ పద్ధతులను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ర్టాలకు నష్టం జరుగుతుందనే అభిప్రాయాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఫిబ్రవరిలో ప్రతిపాదిత లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం తీర్మానం చేసింది.
దేశంలో చివరగా 1972లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 1971 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రక్రియ చేపట్టారు. ఇప్పుడు 2026లో మరోసారి లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరపాలని కేంద్రం భావిస్తున్నది. ఇంకా జనగణన ప్రారంభం కాని నేపథ్యంలో 2026కు కాకపోయినా వచ్చే ఎన్నికల నాటికి పునర్విభజన జరిగే అవకాశం ఉంది. అయితే, సీట్ల సంఖ్యను పెంచకుండా పునర్విభజన చేస్తారా లేదా సీట్ల సంఖ్యను పెంచుతారా అనే స్పష్టత రావాల్సి ఉంది. సీట్ల సంఖ్యను పెంచాలని నిర్ణయిస్తే ఒక అంచనా ప్రకారం 848 లోక్‌సభ స్థానాలు ఏర్పటయ్యే అవకాశం ఉంది. ఇలా చేస్తే దాదాపుగా అన్ని రాష్ర్టాల్లో జనాభాకు తగ్గట్టుగా సీట్లు పెరగనున్నాయి. సీట్ల సంఖ్యను 543గానే కొనసాగిస్తే జనాభాకు తగ్గట్టుగా కొన్ని రాష్ర్టాల్లో నియోజకవర్గాల సంఖ్య తగ్గి, మరికొన్ని రాష్ర్టాల్లో పెరిగే అవకాశం ఉన్నది.
జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ఉత్తరాది రాష్ర్టాలకు నజరానాగా మారనుంది. ముఖ్యంగా జనాభా భారీగా పెరిగిన ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ర్టాల్లో భారీగా లోక్‌సభ నియోజకవర్గాలు పెరగనున్నాయి. ప్రస్తుతం ఈ రెండు రాష్ర్టాల్లో కలిపి 120 స్థానాలు ఉండగా ఇది 222కు పెరిగే అవకాశం ఉంది. అంటే, దాదాపు 85 శాతం పెరుగుదల ఉండనుంది. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం 80 లోక్‌సభ స్థానాలు ఉండగా ఏకంగా 143కు పెరగవచ్చు. బీహార్‌లో ప్రస్తుతం 40 స్థానాలు ఉండగా 79కి పెరగనున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లోనూ భారీగా లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య పెరగనుంది. ఇదే జరిగితే ఉత్తరాదిన యూపీ, బీహార్ లాంటి మూడు నాలుగు రాష్ర్టాలే కేంద్ర రాజకీయాలను నిర్దేశించే స్థాయిలో ప్రాబల్యం చూపగలవు.
స్వాతంత్య్రం తర్వాత దేశంలో జనాభా విపరీత పెరుగుదల పెద్ద సమస్యగా ఉండేది. ఈ నేపథ్యంలో 1970ల నుంచి జనాభా నియంత్రణను ప్రభుత్వాలు జాతీయ లక్ష్యంగా మార్చి, ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేశాయి. వీటిని దక్షిణాది రాష్ర్టాలు మెరుగ్గా అమలు చేసి జనాభాను నియంత్రించాయి. ఇదే ఇప్పుడు దక్షిణాది రాష్ర్టాల పాలిట శాపంగా మారే ప్రమాదం ఉంది. ఒకవేళ జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దేశ రాజకీయాల్లో సౌత్ ఇండియా ప్రాబల్యం భారీగా తగ్గిపోనున్నది. లోక్‌సభ స్థానాల సంఖ్య 848కు పెరిగితే దక్షిణాది రాష్ర్టాల్లో నియోజకవర్గాల సంఖ్య ఇప్పుడు ఉన్న 129 నుంచి 165 శాతానికి పెరుగుతుంది. అంటే, 28 శాతం సీట్లు పెరుగుతాయి. తెలంగాణలో 17 నుంచి 23కు, ఆంధ్రప్రదేశ్‌లో 25 నుంచి 31కి, కర్ణాటకలో 28 నుంచి 41కి, తమిళనాడులో 39 నుంచి 49కి పెరుగుతాయి. కేరళలో ఉన్న 20 సీట్లలో ఒక్క సీటు కూడా పెరగదు.