MK Stalin : ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తో డీఎంకే అధ్యక్షుడు, తమళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ‘సమగ్ర శిక్షా స్కీమ్’ కింద కేంద్ర నిధులు విడుదల చేయాలని, 50:50 ఈక్విటీ షేర్ కింద చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-2కు అనుమతి ఇవ్వాలని ప్రధానిని ఆయన కోరారు. భారత మత్య్సకారులకు సంప్రదాయంగా ఉన్న చేపలవేట హక్కును పరిరక్షించాలన్నారు.
సముద్ర జలాల్లో పట్టుకున్న తమిళ మత్స్యకారులను, వారి పడవలను త్వరితగతిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు. ఈ మేరకు ఒక విజ్ఞాపన పత్రాన్ని ప్రధానికి స్టాలిన్ అందజేశారు. సుమారు 45 నిమిషాలపాటు వారు భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రిగా తాను ప్రధానికి మూడు వినతులు చేశానని, తన వినతులను ఆయన ఆలకించారని చెప్పారు.
చెన్నై మెట్రోను ఏవిధంగా అయితే కేంద్రం, రాష్ట్రం కలిసి అమలు చేశాయో అదేవిధంగా రెండో విడత కూడా అమలు చేయాలని తాము కోరుకుంటున్నామని ప్రధాని చెప్పారు. 2021-22 బడ్జెట్లో చెన్నై రైల్ ఫేస్-2 ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తామని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారని, 2022లో కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపిందని అన్నారు.
మెట్రో రైల్ ప్రాజెక్టు నత్తనడకన నడుస్తోందని, ఆ కారణంగా ఎలాంటి జాప్యం లేకుండా నిధులు విడుదల చేయాలని ప్రధానిని కోరినట్టు స్టాలిన్ చెప్పారు. తమిళ మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలని, సమగ్ర శిక్షా పథకం కింద కేంద్ర నిధులను తమిళనాడుకు విడుదల చేయాలని కూడా కోరినట్టు తెలిపారు.