చెన్నై: దేశ వ్యాప్తంగా కుల ఆధారిత జనాభా గణన (Caste Based Census) చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించారు. కుల ప్రాతిపదికన జన గణనతో పాటు జనాభా గణనను వెంటనే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం ఎంకే స్టాలిన్ కోరారు. బుధవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ‘దేశంలో ప్రతి పౌరుడికి విద్య, ఆర్థిక, ఉపాధిలో సమాన హక్కులు, సమాన అవకాశాలను నిర్ధారించడానికి, విధానాలు రూపొందించడానికి కుల ఆధారిత జనాభా గణన చాలా అవసరమని ఈ సభ భావిస్తోంది’ అని తెలిపారు. ఈసారి కుల ఆధారిత జనాభా గణనతో పాటు 2021 నుంచి జరుగాల్సిన జనాభా గణనను వెంటనే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సభ ఏకగ్రీవంగా కోరుతోందని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.
కాగా, కళ్లకురిచ్చిలో 60 మందికిపైగా మరణించిన కల్తీ మద్యం దుర్ఘటనపై డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నినాదాలు చేశారు. సీఎం ఎంకే స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామితోపాటు అన్నాడీఎంకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు.