న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడం కోసం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను స్వాధీనం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి బ్రిటన్ ఎంపీ లార్డ్ మేఘ్‌నాథ్ దేశాయ్ పిలుపునిచ్చారు. ఆయన గుజరాత్‌లోని వడోదరలో జన్మించారు. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఆయన మంగళవారం న్యూఢిల్లీలో ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, దోషులకు శిక్ష పడే విధంగా భారత దేశం కచ్చితంగా బలంగా స్పందించాలన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా సమాధానం చెప్పాలని తెలిపారు. పహల్గాం దాడి అత్యంత క్రూరమైనదన్నారు. జమ్ము కశ్మీరును భారత దేశంలో కలిపేందుకు సమ్మతిస్తూ మహారాజు లేఖ ఇచ్చారని, అందువల్ల పీవోకే మనదేనని తెలిపారు. దేశాయ్ బ్రిటన్ పార్లమెంటులోని లార్డ్స్ సభ సభ్యుడు.
భారత్ వీడిన 786 మంది పాకిస్థానీయులు ; పాక్ నుంచి స్వదేశానికి 1,465 మంది భారతీయులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్‌లో తాత్కాలిక వీసాలపై ఉన్న పాకిస్థాన్ పౌరులు వెంటనే దేశం విడిచివెళ్లాలంటూ భారత్ విధించిన డెడ్‌లైన్ మంగళవారంతో ముగిసింది. భారత్ విధించిన ఆంక్షల నేపథ్యంలో గత ఆరు రోజుల్లో 786 మంది పాకిస్థానీయులు అటారీ-వాఘా సరిహద్దు గుండా భారత్ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. వీరిలో 55 మంది దౌత్యవేత్తలు, వారి కుటుంబ సభ్యులు, సహాయ సిబ్బందితో పాటు పాకిస్థాన్ వీసా ఉన్న 8 మంది భారతీయులు కూడా ఉన్నారు. అదే సమయంలో ఈ నెల 24 నుంచి 1,465 మంది భారత్‌కు చేరుకున్నారు. వీరిలో 25 మంది దౌత్యవేత్తలు, అధికారులతో పాటు దీర్ఘకాలిక భారత వీసా కలిగి ఉన్న 151 మంది పాకిస్థాన్ పౌరులు ఉన్నారు.