న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కోర్టు వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అలాగే ఆమెతో సహా సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు పంపింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 21న అరెస్ట్ చేసింది. మార్చి 28న ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను రెండోసారి హాజరుపరిచినప్పుడు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజాను వ్యక్తిగతంగా ఆయన పరామర్శించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కూడా ఈ వీడియో క్లిప్‌ను రీట్వీట్ చేశారు.
కాగా, కోర్టు వీడియో కాన్ఫరెన్స్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది వైభవ్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. న్యాయమూర్తులు నీనా బన్సల్ కృష్ణ, అమిత్ శర్మతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిల్‌ను పరిశీలించింది. కేజ్రీవాల్ కోర్టు వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలంటూ ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌తోపాటు ఎక్స్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు వారికి నోటీసులు పంపింది. ఈ కేసుపై తదుపరి విచారణను జూలై 9కు వాయిదా వేసింది.