బెంగళూరు: కర్ణాటక మంత్రివర్గం నుంచి ప్రియాంక్ ఖర్గేను బర్తరఫ్ చేయాలని, ఖర్గే ట్రస్టుకు అక్రమ భూ కేటాయింపుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు మంగళవారం గవర్నర్ను కోరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార్ ట్రస్టుకు బెంగళూరు సమీపంలోని హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్కులో కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి మండలి(కేఐఏడీబీ) ఐదు ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ స్థలం కోసం అనేక సంస్థలు, కంపెనీలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ సిద్ధరామయ్య ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించి ఖర్గేకు చెందిన ట్రస్టుకు కేటాయించిందని, ఇది కుంభకోణమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి మల్లికార్జున ఖర్గే, సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని, భూ కేటాయింపుపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
చట్టప్రకారమే భూకేటాయింపు: సిద్ధరామయ్య
ఖర్గే ట్రస్టుకు చట్టప్రకారమే భూమిని కేటాయించినట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. భూమి పొందడానికి ట్రస్టుకు అర్హత ఉందని, అందుకే కేటాయించామని చెప్పారు.