న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ముంబై 26/11 పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు తహవ్వుర్ హుస్సేన్ రాణాను భారత్‌కు విజయవంతంగా తీసుకువచ్చారు. అమెరికా నుంచి అతడిని తీసుకువచ్చిన ప్రత్యేక విమానం గురువారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. వెంటనే అతడిని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారికంగా అరెస్ట్ చేసి న్యాయపరమైన ప్రక్రియను పూర్తి చేసింది. ప్రస్తుతం అమెరికాలోని జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ సంతతికి చెందిన 64 ఏండ్ల కెనడా పౌరుడు రాణాను ఆ దేశం అధికారికంగా భారత్‌కు అప్పగించడంతో ఎన్ఐఏ, నేషనల్ సెక్యూరిటీ గార్డుల రక్షణలో గురువారం అతడిని భారత్‌కు తీసుకువచ్చినట్టు అధికారులు ప్రకటించారు.
166 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న ముంబై పేలుళ్ల కేసులో రాణా ప్రధాన నిందితుడు. ఈ సందర్భంగా సీజీవో కాంప్లెక్స్‌లోని ఎన్ఐఏ హెడ్‌క్వార్టర్స్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల రోడ్లపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. రాణాను పటియాలా హౌస్‌కోర్టులో హాజరు పర్చేందుకు ఏర్పాట్లు చేశారు. రాణా ఢిల్లీలో దిగిన వెంటనే కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని మీడియా ప్రతినిధులను పోలీసులు ఆదేశించారు. ఎన్ఐఏ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ అడ్వకేట్ దయాన్ కృష్ణన్, ప్రత్యేక ప్రాసిక్యూటర్ నరేంద్ర మన్లు కోర్టు వద్దకు చేరుకున్నారు. స్పెషల్ ఎన్ఐఏ జడ్జి చందర్ జిత్ సింగ్ కేసును విచారించనుండగా, రాణా తరపున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ ప్రతినిధి అయిన న్యాయవాది పీయూష్ సచ్దేవ్ వాదించనున్నారు.
జన్మతః పాకిస్థాన్‌కు చెందిన రాణా తమ దేశ పౌరుడు కాదని బుకాయించేందుకు పాకిస్థాన్ ప్రయత్నించింది. ముంబై పేలుళ్ల కేసు నిందితుడితో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని ఒక ప్రకటనలో పేర్కొంది. 1961లో పాకిస్థాన్‌లో జన్మించిన రాణా కెనడాకు వెళ్లక ముందు పాకిస్థాన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్లో పనిచేశాడు.