ముంబై, డిసెంబర్ 31: ముంబైలోని ఓ ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవల్ని పరిశీలించేందుకు వెళ్లిన ఓ మాజీ కార్పొరేటర్‌కు ఊహించని షాక్ ఎదురైంది. దవాఖానలోని స్వీపర్ ఓ మహిళా పేషెంట్‌కు ఈసీజీ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి వెలుగులోకి వచ్చింది. సిబ్బంది కొరత వల్లే తాను పేషెంట్స్‌కు ఈసీజీ తీస్తున్నానని స్వీపర్ సమాధానమిచ్చాడు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు మాజీ కార్పొరేటర్ ఘటనపై దవాఖాన అధికారులకు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 28న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో విడుదల చేయగా, పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులుంటే.. పేషెంట్ల రక్షణకు ముప్పు వాటిల్లుతుందని, కొంతమంది డాక్టర్లుగా కూడా మారి వైద్య చికిత్సలు చేసే ప్రమాదముందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
ఘటనపై దిద్దుబాటు చర్యలకు దిగిన దవాఖాన అధికారులు, ఈసీజీ పరీక్షల నిర్వహణకు వైద్య సహాయకుడ్ని నియమించారు. గత మూడేండ్లుగా సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటం వల్లే, స్వీపర్‌కు ఈసీజీ పనులు అప్పగించినట్టు వివరణ ఇచ్చారు.