Swami Prasad Mourya | ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ స్వామి ప్రసాద్ మౌర్య సంచలన ఆరోపణలు చేశారు. ఇక్కడి బీజేపీ ప్రభుత్వం తనను చంపేందుకు చూస్తున్నదని ఆరోపించారు. నిత్యం తనకు బెదిరింపులు వస్తున్నాయని, లక్నోలోని ఓ హోటల్లో తనను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడినట్లు ఆయన చెప్పారు. నా తల నరికిన వారికి రివార్డు కూడా బీజేపీ నేతలు ప్రకటించారని పేర్కొన్నారు. బీజేపీ నేతల గుండాగిరిని ప్రశ్నిస్తున్నందుకే తనను అంతమొందించాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.
‘బీజేపీ ప్రభుత్వం నన్ను చంపాలనుకుంటున్నది. మహిళలు, దళితులు, గిరిజనుల సమస్యలను లేవనెత్తడం వల్లనే ప్రభుత్వం ఆగ్రహిస్తున్నది. ఒక వర్గం ప్రజలు నన్ను చంపడానికి కుట్ర చేయడం ప్రారంభించారు. నా తల కోసేందుకు కొందరు రూ.21 లక్షలు, మరికొందరు రూ.51 లక్షల సుపారీ తీసుకున్నట్లు నాకు సమాచారం ఉన్నది. కొందరు నాలుక, మరికొందరు చేతులు కోయాలని మాట్లాడుకుంటున్నారు. ఈ ఉగ్రవాదులు, సాధువుల రూపంలో ఉన్న నేరస్థులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి’ అని స్వామి ప్రసాద్ మౌర్య డిమాండ్ చేశారు.
ఇలా బహిరంగ ప్రకటనలు చేస్తున్నా ప్రభుత్వానికి చెవికెక్కడం లేదని, దీన్ని బట్టి బీజేపీ ప్రభుత్వం నన్ను చంపాలనుకుంటున్న విషయం స్పష్టమవుతున్నదని స్వామి ప్రసాద్ మౌర్య చెప్పారు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నదన్నారు. తనకు భద్రత కల్పించాలని కోరుతూ ఓ లేఖను రాష్ట్రపతితోపాటు ప్రధాని, ముఖ్యమంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపినట్లు ఆయన తెలిపారు.