కోల్‌కతా, మే 11: పశ్చిమ బెంగాల్లో ‘సర్’ ప్రక్రియ.. బీజేపీ ఎన్నికల విజయానికి దోహదపడిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 31 స్థానాల్లో బీజేపీ సాధించిన ఓట్ల మెజారిటీ కన్నా..‘సర్’ పేరుతో తొలగించినవే ఎక్కువగా ఉన్నాయని తాజాగా గణాంకాలు బయటకు వచ్చాయి. బెంగాల్ వ్యాప్తంగా కేంద్రం చేపట్టిన ‘సర్’ ప్రక్రియ ఎన్నికల ఫలితాల్నే తారుమారు చేసిందని మాజీ సీఎం, తృణమూల్ నాయకురాలు మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో తృణమూల్ సోమవారం తన వాదనను వినిపిస్తూ, ‘సర్’ ఓట్ల తొలగింపు పలు నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్ని గణనీయంగా ప్రభావితం చేసిందని తెలిపింది.
ఈ వాదనను ఈసీ వ్యతిరేకించగా, ఈ అంశంపై కొత్తగా పిటిషన్ దాఖలు చేయాలని మమతా బెనర్జీకి ధర్మాసనం సూచించింది. సోమవారం సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. తృణమూల్ నాయకుడు కల్యాణ్ బెనర్జీ వాదనలు వినిపిస్తూ, ఒక స్థానంలో విజేతకు లభించిన ఆధిక్యం, తొలగించిన ఓటర్ల సంఖ్య కంటే తక్కువగా ఉంటే.. ఇది న్యాయసమీక్ష అర్హమైనదిగా జస్టిస్ బాగ్చి గతంలో చేసిన వ్యాఖ్యను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
‘చాలా చోట్ల ఓట్ల తొలగింపు.. అభ్యర్థి ఓటమికి కారణమైన ఓట్ల తేడాకు సమానంగా ఉంది. ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థి కేవలం 862 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అక్కడ ‘సర్’ పేరుతో 5,432 ఓట్లను తీసేశారు. తృణమూల్, బీజేపీకి మధ్య 32 లక్షల ఓట్ల తేడా కనపడగా, అప్పిలేట్ ట్రిబ్యునల్స్‌లో 35 లక్షల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి’ అని కల్యాణ్ బెనర్జీ సుప్రీం కోర్టుకు తెలియజేశారు.