Kerala CM : ఇటీవల ఐదు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలపై ఒక స్పష్టత వచ్చింది. నాలుగు రాష్ట్రాలకు సీఎంల ఎంపిక పూర్తైంది. తమిళనాడు, పదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ సీఎంల ప్రమాణ స్వీకారం పూర్తికాగా.. అసోం సీఎంగా హిమంత ప్రమాణ స్వీకారం 12న జరగనుంది. ఇక మిగిలింది కేరళ. అక్కడ సీఎం ఎంపికపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలో కాంగ్రెస్ అధిష్టానం ఇంకా నిర్ణయించుకులేకపోతోంది.
కేరళంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి అధికారం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అధికార ఎల్డీఎఫ్ను ఓడించి, అధికారం దక్కించుకుంది. 140 అసెంబ్లీ సీట్లున్న కేరళంలో యూడీఎఫ్ కూటమి 102 సీట్లు గెలుచుకుంది. అధికార ఎల్డీఎఫ్ కూటమికి 35 సీట్లు దక్కాయి. ఇక యూడీఎఫ్‌లో అత్యధిక సీట్లు దక్కింది కూడా కాంగ్రెస్ పార్టీకే. దీంతో కాంగ్రెస్ పార్టీకే సీఎం పదవి అందుతుంది. అయితే, సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్ ఎంపీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు వినిపిస్తోంది. ఆయన సీఎం రేసులో ముందున్నారు. తన సీఎం పదవి కోసం ప్రయత్నిస్తున్నారు.
ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. పైగా ఆయన రహస్యంగా రాహుల్‌ను కలిసి సీఎం పదవిపై చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేల్లో 80 శాతం మంది వేణుగోపాల్ వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఆయనతోపాటు వీడీ సతీషన్, రమేష్ చెన్నితల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ ముగ్గురూ తాజాగా ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. సీఎం ఎంపికపై ఈ ముగ్గురితో ఖర్గే, రాహుల్ గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనేతలు మూడు గంటలపాటు చర్చించినట్లు సమాచారం. అయినప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే, సీఎం పదవి కోసం చేస్తున్న ప్రయత్నాల్ని రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఎవరి లాబీయింగ్ వారు చేసుకోవడం వల్ల చివరకు పార్టీకి నష్టం జరుగుతుందని రాహుల్ అభిప్రాయపడ్డట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
నేతలు అందరి మద్దతు కూడగట్టుకోవాలని, విభజన రాజకీయాలు మానుకోవాలని సూచించారు. వేణుగోపాల్, సతీష్, రమేష్.. ఈ ముగ్గురిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు వేణుగోపాల్‌కు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు 45 ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారు. సీఎం పదవికి ఎంపిక చేయడం వల్ల పార్టీలో ఇబ్బందులు రాకూడదని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం ఎంపిక ప్రక్రియ ఆలస్యమవుతోంది. త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానం దీనిపై ఒక నిర్ణయం తీసుకునే వీలుంది.