Rajasthan | జైపూర్, డిసెంబర్ 7: రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి పదవిపై సస్పెన్స్ కొనసాగుతున్నది. గెహ్లాట్ సర్కారును గద్దె దించి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. దీంతో రాష్ట్రంలో రిసార్టు రాజకీయాలు ఊపందుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఇప్పటికే పలువురు పార్టీ ఎమ్మెల్యేలతో మంతనాలు సాగిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలతో ఆమె ఇప్పటికే చర్చలు జరిపినట్టు పేర్కొన్నాయి. తాజాగా ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలను జైపూర్ శివారులోని ఒక రిసార్టుకు రప్పించి రాజే కుమారుడు, పార్టీ ఎంపీ దుష్యంత్‌సింగ్ మంతనాలు సాగించడం చర్చనీయాంశమైంది.
ఈ విషయాన్ని సాక్షాత్తూ పార్టీ ఎమ్మెల్యే లలిత్ మీనా తండ్రి, మాజీ ఎమ్మెల్యే హేమరాజ్ మీనా పార్టీ అధిష్ఠానానికి తెలియజేశారు. తన కుమారుడిని మరో ఐదుగురు ఎమ్మెల్యేలను దుష్యంత్ సింగ్ అపనో రాజస్థాన్ రిసార్టుకు తీసుకుపోయారని, అక్కడి నుంచి అతడిని వదలలేదని, అక్కడ తానే కాక మరో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్టు తన కుమారుడే ఫోన్ చేసి చెప్పినట్టు ఆయన వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన పార్టీ వర్గాలు వెంటనే రిసార్టుకు వెళ్లి లలిత్ మీనాను తమ పార్టీ కార్యాలయానికి తీసుకుపోయారు. అయితే మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలను వసుంధర రాజే నిర్వహించిన మరో క్యాంప్‌నకు తరలించారని ఆయన చెప్పారు. కాగా, ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గాల్లో సురక్షితంగా ఉన్నారని, సీఎం ఎవరనేది అధిష్ఠానమే నిర్ణయిస్తుందని రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి తెలిపారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ అధిష్ఠానం ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తుండటంతో సీఎం అభ్యర్థులపై జోరుగా చర్చ నడుస్తున్నది. తాజాగా ఈ పదవి కోసం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేరు తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి పదవికి ఆయన సరైన వ్యక్తి అని పార్టీలోని మెజారిటీ వర్గం అభిప్రాయపడుతున్నది. అశ్వినీ వైష్ణవ్ అటు ప్రధాని మోదీకి, ఇటు కేంద్ర మంత్రి అమిత్ షాకు సన్నిహితుడు కావడంతో ఆయన ఎంపికకు అడ్డంకులు ఉండకపోవచ్చునని అంటున్నారు.
మరో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా సీఎం పదవికి రేసులో ఉన్నారు. అయితే ఇప్పటికే రాజ్‌పుత్‌లు మిగిలిన రాష్ర్టాల్లో సీఎంలుగా ఉన్నందున ఈయనను ఇక్కడ ముఖ్యమంత్రిగా నిర్ణయిస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మోదీ, అమిత్ షాలకు అత్యంత ఆప్తుడిగా పేరొందిన దళిత నేత అర్జున్ రామ్ మేఘ్వాల్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నది. 18 శాతం మంది దళితులు ఉన్న రాజస్థాన్ సీఎం పీఠంపై అదే వర్గానికి చెందిన వ్యక్తిని కూర్చోబెట్టాలనుకుంటే మేఘ్వాల్కు అవకాశం దక్కొచ్చు.
యూపీ సీఎం యోగి మాదిరిగా పేరొందిన బాబా బాలక్‌నాథ్ సీఎం రేసులో ఉన్నారు. రోహ్తక్లోని ఆయన మఠం హర్యానా, రాజస్థాన్ చుట్టుపక్కల ప్రాంతాలలో బాగా పేరొందింది. హిందూత్వ కార్డుకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే ఆ కోటాలో బాలక్‌నాథ్ సీఎం అయ్యే అవకాశం ఉంది. అలాగే గత కాంగ్రెస్ సీఎం గెహ్లాట్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కిరోడి లాల్ మీనాతో పాటు రాజవంశానికి చెందిన దియా కుమారి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నది. వసుంధర రాజే అనంతరం ఒక మహిళకు అధికార పగ్గాలు ఇవ్వాలనుకుంటే ఈమెను పరిగణనలోకి తీసుకుంటారు.
ఇటీవల బీజేపీ అధికారంలోకి వచ్చిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రులను ఎంపిక చేసే బాధ్యతను బీజేపీ అధిష్ఠానం పరిశీలకులకు అప్పజెప్పనుంది. శుక్రవారం కేంద్ర పరిశీలకులను నియమించే అవకాశం ఉంది. పరిశీలకులు ఆయా రాష్ర్టాల్లో పర్యటించి ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అభ్యర్థులతో సమావేశమవుతారని పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు. మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులపై పార్టీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఎంపికలో సామాజిక, ప్రాంతీయ, పాలన, సంస్థాగత అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.