కోల్కతా, లక్నో: మతపరంగా సున్నిత ప్రాంతమైన పశ్చిమ బెంగాల్లో ముర్ష్షీదాబాద్లో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సస్పెన్షన్కు గురైన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ గట్టి బందోబస్తు మధ్య బాబ్రీ మసీదు శైలిలో నిర్మించ తలపెట్టిన మసీదుకు శంకుస్థాపన చేశారు. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదు ధ్వంసమైన నాడే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. సౌదీ అరేబియా నుంచి ఇద్దరు మతపెద్దలతో పాటు వేలాదిమంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు కబీర్ తెలిపారు. కార్యక్రమానికి ముందు కబీర్ మద్దతుదారులు తలపైన ఇటుకలు మోసుకుని వెళుతున్న దృశ్యాలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగి నేటికి 33 సంవత్సరాలు పూర్తయినప్పటికీ సుప్రీంకోర్టు 2019లో ఇచ్చిన తీర్పు తర్వాత కేటాయించిన స్థలంలో మసీదు నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. అయోధ్య నగరానికి 25 కిలోమీటర్ల దూరంలోని ధనీపూర్ గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో మసీదు నిర్మాణం 2026 ఏప్రిల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.