న్యూఢిల్లీ: రెండు వేర్వేరు సంఘటనల్లో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న నలుగురు డాక్టర్లతోపాటు వారి సహచరులు మరి కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలతో ఉన్నతమైన వృత్తిలో ఉన్న వారిని సైతం ఉగ్రవాద సంస్థలు తమ ఉచ్చులోకి లాగినట్లు వెల్లడి కావడంతోపాటు దేశంలో పెరుగుతున్న వైట్-కాలర్ ఉగ్ర వ్యవస్థ కూడా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, జమ్ము కశ్మీరులో ఏకకాలంలో జరిగిన అరెస్టులలో 2,900 కిలోలకు పైగా బరువున్న బాంబు తయారీ సామగ్రి, రైఫిళ్లు, పిస్టళ్లు, ఇతర అనుమానాస్పద పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్లో జరిగిన మరో ఘటనలో అరెస్టులతోపాటు విషాన్ని తయారుచేసే పదార్థాలతోపాటు పిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరందరి మధ్య ఎటువంటి సంబంధం ఉన్నదీ అధికారులు ఇప్పటివరకు వెల్లడిచలేదు. అరెస్టయిన డాక్టర్లకు పాకిస్థాన్‌తోపాటు ఇతర దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ ఉగ్రశక్తులతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
నిషిద్ధ ఉగ్ర సంస్థలైన ఐసిస్, జైషే మొహమ్మద్, అన్సార్ ఘజ్వాత్-ఉల్-హింద్(ఏజీయూహెచ్) కూడా ఈ డాక్టర్ల వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. కశ్మీరుకు చెందిన డాక్టర్ ముజమ్మీల్ గనీని ఫరీదాబాద్‌లో అరెస్టు చేయగా లక్నో డాక్టర్ షహీన్ని కస్టోడియల్ ఇంటరాగేషన్ కోసం విమానంలో శ్రీనగర్‌కు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. అతడి కారులో ఓ ఏకే-47 రైఫిల్ దొరికినట్లు వారు చెప్పారు. స్వాధీనం చేసుకున్న 2,900 కిలోల పేలుడు పదార్థాలలో అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఫరీదాబాద్‌లోని గనీ అద్దెకున్న ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలలో 360 కిలోల అమ్మోనియం నైట్రేట్, కొన్ని ఆయుధాలు, మందుగుండు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న వస్తువులలో రసాయనాలు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, బ్యాటరీలు, వైర్లు, రిమోట్ కంట్రోల్, టైమర్లు, మెటల్ షీట్లు కూడా ఉన్నాయి. నలుగురు డాక్టర్లతోపాటు మరో నలుగురు వారి సహచరులను అరెస్టు చేసినట్లు ఓ అధికారిక ప్రకటన పేర్కొంది. గనీ, అదీల్ ఫోన్లలో పాకిస్థానీ నంబర్లు అనేకం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ నంబర్లు ఈ నెట్వర్క్ నిర్వాహకులది కావచ్చని అనుమానిస్తున్నారు.
అక్టోబర్ 19న కశ్మీరులోని బన్‌పోరా నౌగామ్‌లో బెదిరింపులతో కూడిన జైషే మొహమ్మద్ పోస్టర్లు కనిపించడంతో అప్రమత్తమైన భద్రతా దళాలు చేపట్టిన దర్యాప్తుతో ఈ అంతర్రాష్ట్ర ఉగ్ర నెట్వర్క్ గుట్టు వెలుగుచూసింది. సామాజిక, దాతృత్వ కార్యకలాపాల ముసుగులో వీరంతా నిధులు సేకరిస్తున్నట్లు తెలిసింది. విద్యార్థులు, ఇతరులను గుర్తించి, వారిని ఉగ్రవాదులుగా నియమించడంలో అరెస్టయిన నిందితుల ప్రమేయం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిధులు సమీకరించడం, ఐఈడీల తయారీకోసం ఆయుధాలు, మందుగుండును సమీకరించడం, వీటిని జాగ్రత్తగా వాహనాలలో ఇతర చోట్లకు తరలించడం వంటి కార్యకలాపాలకు నిందితులు పాల్పడినట్లు అధికారులు చెప్పారు. డాక్టర్లను, ఉన్నత విద్యావంతులను ముందు నిలబెట్టి వీరి ద్వారా ఉగ్రవాద నెట్‌వర్క్‌ను విస్తరించాలన్నది విదేశీ ఉగ్ర నిర్వాహకుల కుట్రగా అధికారులు అనుమానిస్తున్నారు. మహిళా డాక్టర్ షహీన్ కారులో రైఫిల్, లైవ్ కార్ట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ డాక్టర్ అహ్మద్ మొహీయుద్దీన్ సయ్యద్(35) అరెస్టు భద్రతా దళాలలో ప్రకంపనలు సృష్టించింది. ఇతడిని భద్రతా దళాలు నవంబర్ 7న అహ్మదాబాద్‌లో అరెస్టు చేశాయి. ఆముదం గింజల నుంచి రిసిన్ అనే విషపూరిత పదార్థాన్ని తయారుచేస్తున్న సయ్యద్ ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండి, అహ్మదాబాద్‌లోని పండ్ల మార్కెట్, లక్నోలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని రెక్కీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రెండు గ్లాక్ పిస్టళ్లు, ఓ బెరెట్టా, 30 లైవ్ కార్ట్రిడ్జులు, నాలుగు లీటర్ల ఆముదం నూనె అతని ఇంట్లో లభించాయి. ఖొరాసన్ ప్రావిన్సుకు చెందిన అబూ ఖదీమ్ అనే ఐసిస్ ఉగ్రవాదితో సయ్యద్‌కు సంబంధాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. అయితే హర్యానా, జమ్ము కశ్మీరు పోలీసు చేసిన అరెస్టులకు, సయ్యద్ అరెస్టుకు ఏమైనా సంబంధం ఉన్నదీ లేనిదీ అధికారులు వెల్లడించలేదు.