శ్రీనగర్/న్యూఢిల్లీ, జనవరి 11 : జమ్ము కశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్లో నియంత్రణ రేఖ సమీపంలో, ఇతర ప్రాంతాల్లో పాకిస్థాన్‌కు చెందిన పలు డ్రోన్లు చేసిన చొరబాటు ప్రయత్నాన్ని ఆదివారం భారత ఆర్మీ తిప్పికొట్టింది. నౌషెరాలో సాయంత్రం ఒక డ్రోన్ మన భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా మన భద్రతా దళాలు కాల్పులు జరపడంతో వెనక్కి వెళ్లిపోయింది.
పలు ఇతర డ్రోన్లను కూడా తాము గుర్తించామని, ఇవి కూడా మన భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించాయని, వాటిని సమర్థంగా తిప్పికొట్టామని అధికారులు తెలిపారు. ఈ డ్రోన్లు ఏమైనా డ్రగ్స్, ఆయుధాలు లాంటివి జార విడిచాయా అన్న విషయాన్ని పరిశీలించడానికి సైనికులు ఆ ప్రాంతంలో సోదాలు జరిపారు. కాగా, శనివారం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ వైపు నుంచి వచ్చిన ఒక డ్రోన్ సాంబా సెక్టార్లో ఆయుధాలను జార విడిచిన సంగతి తెలిసిందే. అది విడిచిన పార్సిల్లో మెషీన్ గన్లు ఉన్నట్టు ఆర్మీ అధికారులు తెలిపారు.