Food Adulteration | న్యూఢిల్లీ, జూన్ 20: మన దేశంలో ఆహార కల్తీ తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పే ఉదంతాలు తాజాగా ‘ఎక్స్’లో వెలుగులోకి వచ్చాయి. రామ్‌ప్రసాద్ అనే వ్యాపారవేత్త 2005లో తనకు ఎదురైన అనుభవంపై చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. తాను కొత్తగా సర్ఫ్‌ను తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు ఒక సేల్స్ ఎగ్జిక్యూటీవ్ సర్ఫ్‌లో పరిమళాన్ని తగ్గించాలని చెప్పాడని గుర్తుచేసుకున్నారు. ఎందుకని తాను అడగగా పాలల్లో కలిపేందుకు తక్కువ పరిమళం ఉండే సర్ఫ్నే కొంటారని చెప్పడంతో ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు.
పాలు తెల్లగా కనిపించేందుకు, నురుగు వచ్చేందుకు సర్ఫ్ వేసి కలుపుతారని చెప్పాడని, అప్పటి నుంచి ఆ ప్రాంతంలో దొరికే లస్సీ, పెరుగును తినడం మానేశానని చెప్పారు. సర్ఫ్‌ను మార్చేది లేదని చెప్పినట్టు గుర్తు చేసుకున్నారు. ఈ పోస్ట్‌కు స్పందనగా మరో వ్యక్తి తన స్నేహితుడి పల్లిపట్టీ కంపెనీలో అనుభవాన్ని చెప్పారు. ఒకరోజు పల్లిపట్టీలు తయారుచేయడానికి వచ్చిన కొత్త వ్యక్తి రోజుకంటే ఎక్కువ తయారుచేశాడని, పైగా కరకరలాడేలా చేశాడని తెలిపారు. ఇందులో మర్మమేంటో అతడిని అడగగా గిన్నెలు కడిగేందుకు వినియోగించే లిక్విడ్‌ను పోసినట్టు చెప్పాడని గుర్తు చేసుకున్నారు. దీంతో తయారుచేసిన పల్లిపట్టీలను చెత్తకుప్పలో వేసి, ఆ వ్యక్తిని పనిలో నుంచి తొలగించినట్టు చెప్పారు.