హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించడంతో.. ఈ దేశ రైతుల సుదీర్ఘ పోరాటం ఫలించింది అని సీపీఐ సీనియర్ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన రైతుల శాంతియుత పోరాటాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం అనేక కుట్రలు చేసిందని సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ ఉద్యమంలో దాదాపు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. రైతులకు మోదీ క్షమాపణ చెప్పి.. మృతిచెందిన రైతు కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇక చమురు ధరలు కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలన్నారు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలి. మతోన్మాదుల మూర్ఖపుదాడులను అదుపులో పెట్టాలి అని సురవరం సుధాకర్ రెడ్డి సూచించారు.