సూరత్: సూరత్ విమానాశ్రయంలో సోమవారం ఇండిగో ఫ్లైట్ ప్రయాణికులను చికాకు పరిచే సంఘటన ఒకటి జరిగింది. లగేజీ ద్వారం వద్ద తేనెటీగల గుంపు గుమికూడి చాలా సేపటి వరకు అక్కడి నుంచి కదలక పోవడంతో వారి ప్రయాణం గంట ఆలస్యమైంది. సాయంత్రం 4.20 గంటల సమయంలో ప్రయాణికులంతా విమానం లోపలికి ఎక్కిన తర్వాత ఈ ఘటన జరిగింది.
విమానం జైపూర్‌కు వెళ్లడానికి టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతున్న తరుణంలో లగేజీ లోడింగ్ జరుగుతున్నప్పుడు హఠాత్తుగా లగేజీ క్యాబిన్ డోర్‌ను తేనెటీగలు చుట్టుముట్టాయి. వాటికి పొగ పెట్టినా అక్కడి నుంచి కదల్లేదు. దీంతో విమానాశ్రయ ఫైర్ బ్రిగ్రేడ్ను పిలిపించి వాటిని తరిమేయించారు. ఆ తర్వాత 5.26 గంటలకు విమానం జైపూర్‌కు బయల్దేరింది.